Pawan Kalyan : ఢిల్లీలో జనసేనాని.. బీజేపీతో పొత్తుపై తేల్చేస్తారా , పవన్ మనసులో ఏముందో..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలకు ఏడాది వుండగానే ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం హాట్ హాట్‌గా మారిపోయింది. అత్యంత బలంగా వున్నామనుకున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైసీపీని బాగా కృంగదీసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. లోలోపల ఎక్కడో భయం. ఈ క్రమంలోనే సీఎం జగన్ సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సమరోత్సహంతో వుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని.. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో చేరికలుంటాయని , అందుకు సిద్ధంగా వుండాలని చంద్రబాబు కేడర్‌కు అప్పుడే సూచనలు కూడా చేస్తున్నారు.
మచిలీపట్నం సభ తర్వాత సినిమాలకే పరిమితమైన పవన్ :
ఇక జనసేన గురించి వస్తే.. మచిలీపట్నం సభ తర్వాత సినిమాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవర్‌స్టార్ అక్కడ సరదాగా గడిపారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా వున్నారు. సోమవారం ఉదయ్‌పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న పవన్ కల్యాణ్.. బీజేపీకి చెందిన పలువురు పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, తాజా రాజకీయ పరిస్ధితులు, భవిష్యత్తు కార్యాచరణపై పవన్ చర్చించనున్నారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న వేళే.. పవన్ కూడా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తూ వుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనసేన తమతో కలిసి రావడం లేదంటోన్న బీజేపీ :
ఇదిలావుండగా.. జనసేన తమతో కలిసి రావడంత లేదని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనతో పొత్తు వున్నా.. లేనట్లుగానే వుందని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రాలేదని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్ధికి జనసేన మద్ధతు వుందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని కోరినా జనసేన వైపు నుంచి స్పందన లేదని మాధవ్ వ్యాఖ్యానించారు.పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. తాము మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో కమల నాథులతో పవన్ ఏం మాట్లాడతారో.. ఆయనకు బీజేపీ నేతలు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments