Pawan Kalyan:ఎన్డీయే సమావేశానికి రండి .. పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం, 18న ఢిల్లీకి జనసేనాని
- IndiaGlitz, [Sunday,July 16 2023]
జూలై 18వ తేదీన ఢిల్లీలో జరగబోయే ఎన్డీయే సమావేశానికి రావాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. ఎన్డీయే సమావేశంలో పవన్ కల్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని ప్రకటించింది. ఇద్దరు నేతలు ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారని జనసేన వెల్లడించింది.
దూకుడు మీదున్న విపక్షాలు :
కాగా.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలనే ఉద్దేశంతో విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇటీవల పాట్నాలో సమావేశమైన ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిని నిలబెట్టాలని యోచిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. ఎన్డీయే కూటమిలోని పార్టీలతో బలప్రదర్శన చేయాలని నిర్ణయించింది. మిత్రపక్షాలతో పాటు గతంలో ఎన్డీయేను వదిలి వెళ్లిపోయిన టీడీపీ, శివసేన, శిరోమణి అకాలీదళ్ సహా ఏ కూటమిలో లేని పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ పావులు కదుపుతోంది.
బీజేపీ ఆహ్వానంపై స్పందించిన జనసేన :
ఇదిలావుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన రెండో విడత వారాహి యాత్ర ముగిసింది. జూన్ 14 నుంచి 30 వరకు తొలి విడత.. జూలై 9 నుంచి జూలై 14 వరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర నిర్వహించారు పవన్ . ఈ సందర్భంగా వైసీపీ, సీఎం జగన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. ముఖ్యంగా వాలంటీర్లు, మానవ అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.