కర్నూలు జిల్లాలోని కొణిదెల నా ఇంటి పేరు.. భయపెడితే భయపడే రకం కాదు: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
కర్నూలు మసూరి బియ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుందని.. . ఈ బియ్యానికి మద్దతు ద్వారా రూ.18 వందలు వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లాలో జరిగిన జనసేన కౌలు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... ప్రభుత్వం కేవలం రూ.900 మాత్రమే గిట్టుబాటు ధరఇస్తోందన్నారు. మార్కెట్ యార్డుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థ పేరుకుపోయిందని ఆయన ఆరోపించారు. తాను కర్నూలు జిల్లాలోని కొణిదెల గ్రామం ఇంటిపేరుగా ఉన్న వ్యక్తినని... మీరు నా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టినా, రోజుకు ఒకరితో కావాలని బూతులు తిట్టించినా, మానసిక అత్యాచారాలకు పాల్పడినా నా పోరాట పంథాలో ఎలాంటి మార్పు ఉండదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం మీద తమకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. కేవలం మీ పాలసీలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మాట తప్పుతున్న అంశాల మీదనే తాము మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు. మద్యం నిషేధిస్తాం అని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తున్నారని.. వీటి గురించి మాట్లాడితే బూతులు తిట్టిస్తారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మీకు 15 సీట్లు కూడా వచ్చే అవకాశమే లేదని ఆయన జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోందని.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పి పరిస్థితి వచ్చిందని.. బాధితులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తల్లి పెంపకం బాగా లేకుంటేనే అఘాయిత్యాలు జరుగుతాయని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు మాట్లాడడం బాధాకరమన్నారు.
రంజాన్ కోసం ఇఫ్తార్ విందులు ఇచ్చి... టోపీలు పెట్టుకొని ఫోటోలకు ఫోజ్ లు ఇవ్వడం కాదని, జనసేన ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీకి గత ఎన్నికల్లో అండగా నిలబడిన మైనార్టీలు సైతం ఇప్పుడు విసుగు చెందుతున్నారని.. ప్రతి పనికి ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చుకోలేక బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments