AP SSC Results : టీచర్లకు మద్యం షాపుల్లో డ్యూటీలు.. రిజల్ట్స్ ఇలా కాక ఎలా, మీ వల్లే పిల్లలు ఫెయిల్: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పదో తరగతి పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్ధులు ఫెయిల్ అయిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో ఇప్పటికే పలువురు విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు.. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరు.. ధరలను అదుపులో ఉంచి ప్రజలను ఎలానూ సంతోషపెట్టలేరు.. కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అంటూ ఆయన చురకలు వేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి రుజువైందని పవన్ దుయ్యబట్టారు.
అన్నింటికీ తల్లిదండ్రుల పెంపకమే కారణమా:
పిల్లలు చదువులో, పరీక్షల్లో ఫెయిలైతే ‘ఇంట్లో తల్లిదండ్రుల మార్గదర్శకం సరిగా లేదు’నే నెపం వేస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆడపిల్లల మానమర్యాదలను నేరగాళ్లు భంగపరిస్తే ‘తల్లుల పెంపకం సక్రమంగా లేదు’ అని సెలవిస్తారంటూ పవన్ దుయ్యబట్టారు. అప్పుల పాలై వేరే మార్గం కానరాక, ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకం లేక కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ‘అసలు వారు కౌలు రైతులు కానే కాదు’ అంటూ తిమ్మిని బమ్మిని చేస్తారని జనసేనాని విమర్శించారు. వైసీపీ సర్కారు వారి ఇటువంటి వాదనలు వింటుంటే ఈ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా.. తెలుగువారందరికీ రోత కలుగుతోందన్నారు. మీరు చెప్పే లెక్కల ప్రకారం మీ పాలన సరిగా లేదని.. మరి దీనికి ఎవరిని నిందించాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
మీ విధానాలను చరిత్ర మరిచిపోదు:
2018, 19 సంవత్సరాలలో పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే వరుసగా 94.48%, 94.88% శాతం ఉండగా ఈ ఏడాదికి సంబంధించి విడుదలైన ఫలితాలలో 67.26% మంది మాత్రమే ఉతీర్ణులయ్యారని ఆయన తెలిపారు. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్ప ఉతీర్ణతని... రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి మీరు మీ చేతగానితనాన్ని దాచి పెట్టుకోవచ్చని.. కానీ విద్యా వ్యవస్థలోని లోపభూయిష్ట విధానాలను మాత్రం చరిత్ర దాచి పెట్టుకోదని ఆయన హెచ్చరించారు.
స్కూళ్లకు రంగులేయడం కాదు.. బోధనా సిబ్బందిని నియమించాలి:
పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీషులో పాఠాలు చెప్పేస్తాం అనగానే సరిపోదని పవన్ కల్యాణ్ చురకలు వేశారు. నాడు – నేడు కోసం రూ.16 వేల కోట్లు ఇచ్చామని చెప్పుకొన్నారని... ఆ వేల కోట్ల రూపాయలు ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. ముందుగా తగినంతమంది బోధనా సిబ్బందిని నియమించాలని... ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఎస్సీ ప్రకటనే ఇవ్వలేదనేది వాస్తవమని పవన్ అన్నారు. విద్యా ప్రణాళిక పటిష్టంగా ఉండాలని.. జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తల సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు.
పాఠాలు చెప్పాల్సిన టీచర్లకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు:
అసలే అరకొరగా ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్ ప్రశ్నించారు. అలాంటి డ్యూటీలు చేయించి.. మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంలో ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించిన పాపమే ఈనాటి ఫలితాలని ఆయన చురకలు వేశారు. రీ వాల్యూయేషన్ చేస్తాం రూ.500 కట్టాలని మరో దోపిడీకి సర్కారు వారు తెర దీశారని పవన్ కల్యాన్ ఆరోపించారు. అయితే పరీక్ష తప్పిన పిల్లల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వారి విలువైన కాలం వృథా కాకుండా 10 గ్రేస్ మార్కులను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తరువాత రీ కౌంటింగ్ ను.. ఆపైన సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను ఉచితంగా చేయాలని జనసేన పక్షాన, పిల్లల తల్లిదండ్రుల పక్షాన డిమాండ్ చేస్తున్నానని పవన్ చెప్పారు. మీ చేతకానితనాన్ని పిల్లల భవిష్యత్తుపై రుద్దవద్దని ఆయన హితవు పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com