మన కులపోడని ఓట్లేశారు .. చూస్తున్నారుగా, క్రిమినల్స్‌ని గెలిపిస్తే ఇదే గతి : జగన్‌పై పవన్ ఆగ్రహం

  • IndiaGlitz, [Saturday,June 17 2023]

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, దర్యాప్తు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాపం సీఎం పసివాడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబాయిని చంపేసి ఆ రక్తం తుడుచుకొని వచ్చి మళ్లీ నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాడంటూ దుయ్యబట్టారు. వివేకా కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వీళ్ల మీద ఆధారాలతో నిందారోపణలు చేస్తుంటే వీళ్లు మాత్రం సొంత చిన్నాన్న కూతురు మీద నిందారోపణలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. సొంత తండ్రిని ఎవరైనా చంపుకుంటారా.. క్రిమినల్స్ ను ఎన్నుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. తాను బతికున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద క్రిమినల్స్ కూర్చొవడానికి ఇష్టపడనని.. అలా జరగకుండా తన వంతు పోరాటం తాను చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ప్రజా ధనం నుంచి ప్రకృతి వనరుల వరకు దోపిడీయే:

వైసీపీ నాయకులు అప్పులు తెచ్చి, ట్యాక్సులు పెంచి అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, లారీలపై హరిత పన్ను, భవనాల నిర్మాణాలపై పన్ను ఇలా పెంచుకుంటూ పోతూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం నుంచి ప్రకృతి వనరుల వరకు దోచుకుంటూ వైసీపీ నాయకులు కోట్లు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జనసేన మాట్లాడితే గానీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదురించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారని.. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కులం చూడొద్దు... గుణం చూడండి

ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా? కాదా అని చూడకుండా... సమర్ధుడా కాదా అని ఆలోచించి ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. సముద్ర కోతతో ఉప్పాడ గ్రామం మూడొంతులు మునిగిపోయిందని దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ల పంటలకు గిట్టుబాటు ధరతో పాటు విత్తనాలు సకాలంలో అందేలా చూస్తామన్నారు. రాష్ట్రానికి అన్నపూర్ణవంటి గోదావరి జిల్లాల్లో నీళ్లు కలుషితమైపోయాయని, గోదావరి జిల్లాలను కాపాడుకోగలిగితే రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దశ, దిశా మార్చేలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కసారి నిజాయతీనే నమ్ముకున్న జనసేనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరారు.