Pawan Kalyan: 11 ఏళ్ల తర్వాత కోనసీమలో ‘క్రాప్ హాలిడే’.. ఈ పాపం జగన్‌దే : పవన్ విమర్శలు
- IndiaGlitz, [Friday,June 10 2022]
వైసీపీ పాలన, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనంటూ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని... కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపరు, రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరంటూ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
11 ఏళ్ల తర్వాత కోనసీమలో క్రాప్ హాలిడే:
ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందని.. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమన్నారు. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని.. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైనా ఉంటాయని.. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని.. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుందని ఆయన గుర్తుచేశారు.
మొత్తం 50 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే:
తనకు తెలిసి 2011లో ఒకసారి ఇలా జరిగిందని.. అప్పుడు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసిందని.. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని ఆయన గుర్తుచేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని కొన్ని సూచనలు చేశారని.. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని జనసేనాని వెల్లడించారు.
వ్యవసాయాన్ని జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలి:
రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని.. దాదాపు రూ. 475 కోట్లు బకాయిలు ఉన్నాయని పవన్ వెల్లడించారు. రైతులు పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రి వారి ఖాతాల్లో రూ. 139 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారంటూ ఆయన దుయ్యబట్టారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని పవన్ చెప్పారు. తొలకరి పంటకు భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దీని ఫలితంగా ధాన్యం రంగు మారితే ప్రభుత్వం ధర ఇవ్వడం లేదని పవన్ విమర్శించారు. కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయని.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారని ఆయన గుర్తుచేశారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా కార్యరూపం దాల్చలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.
రైతులకు జనసేన అండగా వుంటుంది:
పంట విరామం ప్రకటించిన రైతులపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం చౌకబారుతనంగా ఉందని... ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్లనూ ఇలానే తిట్టారని జనసేనాని ఫైరయ్యారు. తల్లిదండ్రుల మార్గనిర్దేశం సరిగాలేకనే 10వ తరగతి విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని చెప్పారని... ఆడబిడ్డ మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని విమర్శలు చేశారంటూ పవన్ దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యత లేదని కామెంట్లు చేశారని ఆయన విమర్శించారు. ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడటం తప్ప... సమస్యను పరిష్కరించే మనస్తత్వం వైసీపీ నేతలకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంట విరామం ప్రకటించిన రైతాంగంపై వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రైతు సోదరులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.