Janasena: వైసీపీ మళ్లీ వచ్చిందా .. ఏపీని ఎవ్వరూ కాపాడలేరు, ఆడపడచులారా ఆలోచించండి: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'అన్న వస్తున్నాడు... అక్కచెల్లెమ్మల బతుకుల్లో వెలుగులు నింపుతాడు.. పూర్తిగా మద్యనిషేధం చేస్తాడని చెప్పి వైసీపీ మోసం చేసిందన్నారు. మద్యం రక్కసి రాష్ట్రం నుంచి దూరంగా పారిపోతుందని ఆశతో అన్నకు నమ్మకంగా ఓట్లు వేశారు... అన్న వచ్చాడు ఏమైంది అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యనిషేధం చేస్తానని చెప్పిన అన్నే కల్తీ మద్యం అమ్ముతున్నాడని.. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి మరి మద్యం సరఫరా చేయడమే అన్న చేసిన ఘన కార్యమంటూ పవన్ చురకలు వేశారు.
ప్రశ్నిస్తే కేసులు:
మద్యం, ఇసుక.. అన్నిట్లో దోచేస్తూ ప్రశ్నించిన వాళ్ళను వేధించి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ... వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి గత మూడేళ్లలో సుమారు 5000 మంది వరకు మృతి చెంది ఉంటారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట కల్తీ మద్యం బారిన పడి ఎందరో మృత్యువాత పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి అండగా నిలవాల్సిన కుటుంబ పెద్ద కల్తీ మద్యం బారినపడి మృత్యువాత పడుతున్నారని, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకొస్తున్నాయని జనసేనాని చెప్పారు.
అక్కాచెల్లెమ్మల పసుపు , కుంకుమలు తుడిచేస్తున్న వ్యక్తి ‘‘అన్న’’ కాదు:
అక్కా చెల్లెమ్మల పసుపు, కుంకుమలు తుడిచి పెట్టేలా పాలన చేస్తున్న అన్న గురించి మీరే ఆలోచించాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నడుం బిగించాల్సింది మీరేనని... ఆడపడుచులు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ దాష్టికాల మీద కదం తొక్కితే తప్ప మార్పు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త మద్యం విధానం మరోసారి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈసారి బార్ల విధానంలో సమూల మార్పులు చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అర్ధరాత్రి వరకు బార్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా, దిగువ స్థాయి వైసీపీ నేతలను ప్రోత్సహించేందుకు మార్పులు, చేర్పులు చేపట్టిందని ఆయన దుయ్యబట్టారు.
మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుకు నో :
మద్య నిషేధం పూర్తిగా అమలు పరుస్తామని చెప్పిన వ్యక్తి గత మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల ఆదాయాన్ని మద్యం మీద అర్జించాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మరో రెండేళ్లలో రూ.30 వేల కోట్ల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రూ.100లు ఉన్న క్వార్టర్ మద్యం ధరలు రెండింతలపైగా పెంచేశారని పవన్ గుర్తుచేశారు. డిజిటల్ చెల్లింపులు చేయాలని కేంద్రం ప్రోత్సహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచిత్రంగా మద్యం మీద డిజిటల్ చెల్లింపులకు నో చెబుతోందని ఆయన చురకలు వేశారు.
రాష్ట్రంలో 70 రకాల మద్యం బ్రాండ్లు:
అంటే మద్యం మీద వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తుంది.. ఎటు వెళ్తుంది అన్న లెక్క ఉండకూడదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు వద్దని చెబుతోందని పవన్ ఆరోపించారు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని.. 70 రకాల నకిలీ మద్యం బ్రాండ్లు వున్నట్లు అంచనా అని పవన్ చెప్పారు. ఆదాన్ డిస్టిలరీస్ పేరుతో కల్తీ మద్యం అమ్ముతోన్న ప్రభుత్వం ఆ కంపెనీ ఎవరిదో బయటపెట్టాలని ఆయన ప్రశ్నించారు. మాకు వచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతల బినామీలు కొందరి పేర్లు బయటికి వస్తున్నాయిని జనసేనాని చెప్పారు.
అక్కాచెల్లెమ్మలు నడుం బిగించాలి:
రాష్ట్రంలో ప్రతి లీటరు మద్యం అమ్మకాలపై రూ. 5 కప్పం హైదరాబాదులో కట్టాల్సిన పరిస్థితి నెలకొందని పవన్ ఆరోపించారు. ఈ కప్పం డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? కప్పం తీసుకొని కల్తీ మద్యం తయారు చేస్తున్న కంపెనీలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వాన్నిది కాదా? అన్నీ తెలిసే నియంత్రించడం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఇంతగా పేదల జీవితాల పై ఆటలాడుతున్న వ్యక్తిని ఆడపడుచులు ఎలా నమ్మారు? అన్నగా ఎందుకు భావించారు? అడ్డగోలుగా మద్యం అమ్ముతూ మన బతుకులను ప్రభుత్వమే చిధ్రం చేస్తోందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఈసారి ప్రతి ఇంటి నుంచి అమ్మ, అక్క, చెల్లెలు నడుం బిగించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆలోచిస్తే... అన్న పాలన ఎంత దారుణంగా ఉందో మీకే అర్థం అవుతుందని పవన్ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments