Janasena :వైసీపీ ఉప్మా పార్టీ , పిట్టకథ చెప్పి.. జగన్ పాలన ఎలాంటిదో చెప్పిన పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Thursday,June 22 2023]
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం జగన్ ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశాడని ఆరోపించారు. రైతాంగం తనను ఒక్కసారి విశ్వసించాలని.. మీ బతుకుల్లో వెలుగులు తెచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ తెలిపారు. తాను ప్రజల తరఫున బలంగా పోరాడాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ ప్రభుత్వ తప్పులను భరించలేక తెగించి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. తన దగ్గర అవినీతి సొమ్ము లేదు... గూండాలు లేరని తనకు వారాహి అమ్మే రక్షణ అన్నారు.
కులాల గురించి మాట్లాంది ఎవరు :
రాష్ట్రంలో రెండే కులాలు అధికారం, ఆర్థిక వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. కులాలన్నీ బాగుపడాలని, వారికి ఆర్థిక దన్ను రావాలని, అధికారం చేతపట్టేలా చూడాలన్నదే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తాను కొద్దిరోజులుగా కులాల గురించి, కులాల ఐక్యత గురించి మాట్లాడుతుంటే కొందరు వైసీపీ నాయకులకు కోపం వస్తోందన్నారు. అమరావతి అనే రాష్ట్ర రాజధానిని కుల రాజధాని అని వాళ్లు అభివర్ణిస్తే తప్పు లేదా పవన్ ప్రశ్నించారు. కులాలన్నీ కలిసి రావాలి, అధికారం అందరికీ అందాలని తాను మాట్లాడుతుంటే మాత్రం మీకు గిట్టదంటూ దుయ్యబట్టారు. మీరు మాత్రం మా ఇళ్లలోని మహిళలను బూతులు తిట్టించవచ్చా, మహిళల మీద దాడులకు పురిగొల్పవచ్చా అని పవన్ నిలదీశారు. తాను వైసీపీ నేతలకు ఇష్టం లేని కులాల ఐక్యత గురించి మాట్లాడితే మాత్రం వారికి ఎక్కడా లేని కోపం వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ ఎంపీనైనా బెదిరించగలడు :
వైసీపీ నాయకుడు (సీఎం జగన్) ఎంపీని బెదిరించగలడని, దళితుడ్ని చంపి ఇంటికి పార్శిల్ పంపిన ఎమ్మెల్సీ భుజం తట్టగలడని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు ఏం చేసినా తప్పు కాదు.. మనం మాట్లాడిందే తప్పన్నారు. 70: 30 సర్కారు ఇదన్న పవన్ కల్యాణ్.. 100 మంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసీపీ సర్కారు తనకు కావాల్సిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటోందని ఆరోపించారు. కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటోందన్నారు.
విపక్షాలు అనైక్యంగా వుంటే మళ్లీ వైసీపీయే :
ఓ హాస్టల్లో రోజూ ఉప్మా పెడుతుంటే, మాకు ఉప్మా వద్దని ఎదురుతిరిగారని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెడితే.. కేవలం 18 మంది ఉప్మా కావాలని కోరితే, మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్ల పేరు చెప్పారని చెప్పారు. అయితే ఉప్మా కోరుకున్న వారి సంఖ్యే అన్నిటి కంటే ఎక్కువ ఉండటంతో మళ్లీ ఉప్మానే దిక్కు అయిందని పవన్ కల్యాణ్ కథ చెప్పారు. వైసీపీ కూడా ఉప్మా తరహా పార్టీనేనని.. ఆ పార్టీ వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరమని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల్లోని అనైక్యతే వైసీపీకి బలమని.. అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో విభిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉండటం సహజమని ఆయన పేర్కొన్నారు.
కోనసీమ అల్లర్లకు ప్రభుత్వమే కారణం :
వైసీపీ ప్రభుత్వం అమలాపురం లోక్సభ స్థానానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడానికి సమయం తీసుకోవడం కూడా కుట్రలో భాగమేనని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించకుండా, మొత్తం అన్నీ జిల్లాలకు పేర్లు పెట్టిన తర్వాత ప్రత్యేకంగా సమయం తీసుకొని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని పవన్ గుర్తుచేశారు. జనసేన పార్టీ తొలి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును స్వాగతించిందని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయని.. ఆ పేరు సమాజంలోని ఓ వర్గానికి నచ్చకపోతే వారిని పిలిచి ప్రభుత్వం మాట్లాడి ఒప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అందరికి నచ్చజెప్పాల్సిందిపోయి.. దాన్ని వైసీపీ గాలికి వదిలేసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చు రేపి చలికాచుకోవాలనేది వైసీపీ ప్లాన్ అని ఆయన ఆరోపించారు. కోనసీమ ముందుకు వెళ్లాలంటే జీఎంసీ బాలయోగి వంటి దళిత నాయకుల బాటలో నడవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.