Pawan Kalyan : సీఎం పదవి .. పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు, ఈసారి స్వరంలో స్పష్టమైన మార్పు
- IndiaGlitz, [Thursday,May 11 2023]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పవన్ ఈ రోజు పరామర్శించి, భరోసా కల్పించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న ఆయన.. లెఫ్ట్, రైట్ పార్టీలతో కలిసి వెళ్లాలని వుందని తన మనసులోని మాటను చెప్పారు. వైసీపీ నుంచి అధికారం లాక్కుని, దానిని ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖచ్చితంగా పెట్టుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
సీఎం చేయమని అడగను :
నన్ను సీఎం చేయమని టీడీపీ , బీజేపీలను అడగనని ఆయన అన్నారు. కండీష్లను పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారని.. అందుకే జూన్ 3 నుంచి తాను ఇక్కడే వుంటానని పవన్ తెలిపారు. పొత్తులకు సీఎం అభ్యర్ధి ప్రామాణికం కాదని.. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తన సత్తా ఏంటో చూపించి డిమాండ్ చేస్తానని పవన్ తెలిపారు.
గతంలో అలా అయ్యుంటే బాగుండేది :
ఇటీవలి ఢిల్లీ పర్యటనలో పొత్తులపై చర్చించామని ఆయన వెల్లడించారు. తమకు బలం వున్న మేరకే సీట్లు అడుగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా సీఎంని అవుతానన్న ఆయన.. గత ఎన్నికల్లో 30 స్థానాలను జనసేనకు ఇచ్చుంటే ఈసారి ఖచ్చితంగా సీఎం రేసులో వుండేవాడినని పవన్ తెలిపారు. పొత్తుల విషయంలో జనసేన పార్టీ స్టాండ్ మారలేదని.. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామని స్పష్టం చేశారు.