Janasena Chief Pawan Kalyan:కుట్రలు చేసి నన్ను ఓడించారు.. ఈసారి అసెంబ్లీలో ఎంట్రీ పక్కా, ఎవడు ఆపుతాడా చూస్తా : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి జంక్షన్ వద్ద నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు పవన్. సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడని వ్యాఖ్యానించారు. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో మనమున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సంపదను దోచి, మళ్లీ దాన్ని ప్రజలకు పంచి పెట్టే నాయకులు కావాలో, సంపద సృష్టించి అన్నీ వర్గాలకు పంచి పెట్టే పాలన కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
భీమవరంలో మొత్తం ఓట్లు లక్షే.. మరి లక్షా 8 వేలు ఓట్లు ఎలా పోలయ్యాయి :
అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తామని పవన్ పేర్కొన్నారు. ప్రజల గొంతు బలంగా వినిపిస్తామని.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా? ఉమ్మడిగా వస్తుందా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ఆ రోజు వస్తే కచ్చితంగా ప్రజల మధ్యనే పారదర్శకంగా చెబుతామని.. కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో తాను ఓడిపోయాలా చేశారని పవన్ ఆరోపించారు. లక్షమంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయని.. ఇది కుట్ర కాక ఇంకేంటి అని ఆయన ప్రశ్నించారు. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో తాను చూస్తానంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. యాత్ర రథానికి వారాహి అనే పేరు తాను కోరుకుంటే రాలేదని.. తాను నిత్యం పూజించే ఆ తల్లి చల్లని దీవెనలు నా వెంట ఉన్నాయి కనుకే ఈ వాహనానికి వారాహి అనే పేరు వచ్చిందని ఆయన తెలిపారు.
అప్పులు చేసి సంక్షేమమా :
సంపద సృష్టించి దాన్ని అర్హులకు తగిన విధంగా అందించడాన్ని జనసేన సమర్థిస్తుందని పవన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వెయ్యిమంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున తన సొంత సంపదను సహాయంగా అందించానని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల ద్వారా నా కష్టం నుంచి వచ్చిన సంపదను సాయంగా ఇవ్వగలిగానంటే అక్కడ సంపదను సృష్టించబట్టే అండగా నిలబడగలిగామని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాదు.. ఉద్యోగాలు లేవు.. పన్నుల బాదుడుతో ప్రజలు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమం అంటున్నారని.. ఇదేం తీరు, అప్పులు చేసి గొప్పతనం అంటే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
జనసేన సంక్షేమానికి వ్యతిరేకం కాదు :
సంపద సృష్టికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నా దాన్ని వినియోగించుకోకుండా, అప్పులు చేసి డబ్బులు పంచడం అంటే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమేనని ఆయన పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయని... దానికి తగినట్లుగా రాష్ట్రంలో అన్నీ మార్గాల ద్వారా సంపదను పెంచి సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. చెత్త పన్ను దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల ఫీజులు వరకు అన్నీ పన్నులు పెంచేశారని.. ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బునే మళ్లీ పంచుతూ రాబిన్ హుడ్ లా ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోందని పవన్ సెటైర్లు వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com