Pawan Kalyan:కోవర్టుల వల్లే ప్రజారాజ్యం విలీనం .. జనసేన నేతల్లా వుండుంటే, అలా జరిగేదా : పవన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
2009లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సామాన్యుడికి అండగా ఉండాలని 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, అధికారం చూడని వర్గాలకు అధికారం అందాలనే ఆశయంలో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ గుర్తుచేశారు. రాజకీయ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని జనసేనాని తెలిపారు. కానీ కొందరు కోవర్టుల వల్ల పార్టీని విలీనం చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజోలు నాకు దారి చూపింది :
రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తల్లా ఆనాడు నాయకులు బలంగా నిలబడి ఉంటే పార్టీని విలీనం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది అనే కవి మాటలు చెప్పానని పవన్ వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని రాజోలు నియోజకవర్గంలో గెలిపించి మార్పు కోసం చిరు దీపం వెలిగించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే భవిష్యత్తులో అఖండ జ్యోతిగా ప్రజలందరికీ వెలుగులు పంచుతుందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
స్వార్ధ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ మారారు :
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోయారని పవన్ ఆరోపించారు. ఆయనేం చిన్న పిల్లాడు కాదని, బాగా చదువుకున్న వ్యక్తని అన్నారు. నిజమైన అంబేద్కరిజం అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడటమని, అంతే తప్ప ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం కాదని పవన్ చురకలంటించారు. ఓడిపోయిన తరువాత కూడా ప్రజలు భుజం తట్టి అండగా నిలబడటం ఒక్క జనసేన పార్టీ విషయంలోనే జరిగిందన్నారు. కష్టాలను తట్టుకొని నాయకులు నిలబడితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అండగా నిలబడతారని వారాహి యాత్ర నిరూపిస్తోందన్నారు.
వైసీపీ పాలన నుంచి గోదావరి జిల్లాలను విముక్తి చేయాలి :
బలం ఉన్న చోట నుంచే యుద్ధం మొదలు పెట్టాలని.. జనసేనకి ఉభయగోదావరి జిల్లాకు మంచి పట్టుందని పవన్ మరోసారి పునరుద్ఘాటించారు. దాదాపు 18 శాతం ఓటు బ్యాంకు ఉందని, ముందుగా వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయగలిగితే రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిన్న రాజోలు మెయిన్ రోడ్డులో తన ప్రయాణం పడవ ప్రయాణంలా సాగిందని.. అడుగుకో గుంతపడి ప్రయాణం నరకంగా మారిందని రాష్ట్రంలో రోడ్డ పరిస్థితిపై పవన్ చురకలంటించారు. వాహనమిత్ర పేరుతో ఇస్తున్న పది వేల రూపాయలు ఆటోల రిపేర్లకు కూడా రావడం లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout