GoodMorningCMSir : పందుల్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదా.. స్విమ్మింగ్ పూల్స్‌లా రోడ్లు : జగన్‌పై పవన్ సెటైర్లు
- IndiaGlitz, [Thursday,July 14 2022]
ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్ధితిపై మరోసారి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీఅరా గోతులు కనిపించడం సహజమని... కానీ మన రాష్ట్రంలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. కొన్ని రహదారులను చూస్తుంటే ఏకంగా స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని.. రోడ్ల అభివృద్ధి, కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోందని ఆయన వెల్లడించారు.
జూలై 15 నాటికి రోడ్లు బాగు చేస్తామని సీఎం జగన్ ఛాలెంజ్:
జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టామని జనసేనాని అన్నారు. దెబ్బ తిన్న రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్ తో గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశామని పవన్ గుర్తుచేశారు.
పందుల్ని డిస్ట్రబ్ చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదేమో:
ఆర్ అండ్ బి పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6100 కి.మీ ఉన్నాయని పవన్ తెలిపారు. 9,222 కి.మీ పంచాయతీ రోడ్లు మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించిందని, రోడ్ల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయని.. మూగ జీవాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైసీపీ నాయకులు రోడ్లు వేయడం మానేశారంటూ జనసేనాని సెటైర్లు వేశారు.