Janasena Chief Pawan Kalyan:నా రెండు చెప్పులూ కొట్టేశారు .. వైసీపీ నేతలు ఇలా తయారేంట్రా : పేర్ని నానికి పవన్ కళ్యాణ్ సెటైర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల తనకు రెండు చెప్పులూ చూపిస్తూ హేళనగా మాట్లాడిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లినపుడు నాకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారని వ్యాఖ్యానించారు. అయితే మీ చెప్పులు టీవీలో ఓ వ్యక్తి చేతిలో కనిపించాయి అని ఒకరు చెప్పారని పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ చెప్పులంటే తనకు చాలా ఇష్టమని.. దయచేసి ఆయన దగ్గరున్న నా చెప్పులు నాకు ఇప్పించాలంటూ జనసేనాని సెటైర్లు వేశారు. చివరికి వైసీపీ నాయకులు చెప్పులను కూడా కాజేస్తే ఎలా .. గుళ్లలో చెప్పులు కూడా పట్టుకుపోయేలా ఈ నాయకులు తయారయ్యారంటూ పేర్ని నానిపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.
మట్టి దోపిడికి కింగ్ కాకినాడ ఎమ్మెల్యే:
వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగానికి బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించిందని పవన్ తెలిపారు. పిఠాపురం ప్రాంతానికి సాగునీరు అందించే ఏలేరు రిజర్వాయర్ నిధులేవీ కేటాయించలేదని.. రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు నిలిపేశారని మండిపడ్డారు. గొల్లప్రోలు ప్రాంతం దీనివల్ల మురుగుతో నిండిపోతోందని..కాలువల పూడికతీత లేదన్నారు. పనులు చేయమంటే రివర్స్ టెండరింగ్ అంటూ నాటకాలు ఆడటం తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం చుట్టపక్కల ప్రాంతాల నుంచి అక్రమంగా మట్టిని రోజూ తవ్వుతున్నారని.. రోజుకు 300 లారీల మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అంటే రోజుకు రూ.2 కోట్లను దోచేస్తున్నారని .. ఈ సొమ్మంతా వైసీపీ నాయకుల జేబుల్లోకే వెళ్తోందని వ్యాఖ్యానించారు. కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు అందినకాడికి మట్టి బొక్కేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
3 వేలు, 5 వేలు జీతానికి యువతను పరిమితం చేయను :
అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జనవరిలో యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని .. దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని పవన్ గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మంది యువతను ఎంపిక చేసి, వారు వ్యాపారం పెట్టుకునేలా రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వారు పదిమందికి ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దుతామని.. అంతే తప్పించి రూ. 5 వేలు, రూ.3 వేలు జీతాలకు చాకిరి చేసేలా చేయమన్నారు. దీనికి ఏటా రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనా వేశామని.. వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటా రూ.10 వేల కోట్లు సంపాదిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సీఎం ఎన్నికల ముందు అన్నట్లు నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. అది చేసేస్తా.. అన్నీ ఇచ్చేస్తా... అని చెప్పనని సెటైర్లు వేశారు. తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని.. మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని పవన్ పేర్కొన్నారు.
అందరు హీరోలూ , వాళ్ల అభిమానులు నాకిష్టమే :
సినిమాలు వేరు.. రాజకీయం వేరన్న ఆయన.. తనకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు ఇష్టమేనని స్పష్టం చేశారు. అందరి అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తాను ఒక్క సినిమా చేస్తే దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు చేయబట్టే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోగలిగానని.. సంపద సృష్టించాను కాబట్టే పంచగలిగానని పవన్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout