Janasena : సమీక్షా సమావేశాలతో పవన్ బిజిబిజీ.. ఏపీ, తెలంగాణ నేతలతో వరుస భేటీలు, ఎన్నికలపై దిశానిర్దేశం
- IndiaGlitz, [Saturday,June 25 2022]
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుండటంతో జనసేన అధినేత పపన్ కల్యాణ్ యాక్టీవ్ అయ్యారు. ఇప్పటికే కౌలు రైతుల భరోసా యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్తున్న ఆయన దసరా నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే సమయంలో పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరచడంతో పాటు నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
నాలుగు రోజులుగా సమీక్షా సమావేశాలు:
తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన నేతలతో వరుస సమావేశాలతో తలమునకలై ఉన్నారు వున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని పార్టీ నాయకులూ, వివిధ విభాగాల్లో ఉన్న యువ నాయకులూ, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. ఈ క్రమంలో దాదాపు 32 మందితో పవన్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
త్వరలో రాజకీయ శిక్షణా శిబిరాలు:
ప్రజా పక్షం వహిస్తూ పార్టీ పక్షాన వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను నాయకులూ, శ్రేణులూ పరస్పర అవగాహనతో, సమన్వయంతో చేపట్టాలని ఆయన సూచించారు. తదుపరి తెలంగాణాలో చేపట్టబోయే డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణపై ఈ సందర్భంగా పవన్ చర్చించారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు త్వరలో కార్యక్రమం రూపొందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పవన్:
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలతోనూ పవన్ ముచ్చటించారు. వారి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. విశాఖపట్నం, రాజోలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను ఆయన అప్యాయంగా పలకరించారు. శుక్రవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులతో భేటీ అయి.. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ముందుకు వెళ్లడంపై పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం నిర్దేశం చేశారు.