Laurus Labs Accident: లారస్ ల్యాబ్స్ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి.. ఆ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ ఏది
- IndiaGlitz, [Thursday,December 29 2022]
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని నలుగురు మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ఆర్ధిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ప్రాంతంలోని ఫార్మా పరిశ్రమల్లోనూ, ఇతర పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
రియాక్టర్ పేలుడుతో మంటలు:
ఇకపోతే.. లారస్ పరిశ్రమలోని యూనిట్ 3 కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్లాంట్‌లోని మ్యాన్‌ఫ్యాక్చరింగ్ నెంబర్ 6 బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రియాక్టర్‌లో పేలుడు సంవించి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇవి పక్కనే వున్న రబ్బరు పరికరాలకు అంటుకోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ అంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రాంబాబు, తలశిల రాజేశ్ బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబాలకు కంపెనీ పరిహారం:
మరోవైపు.. లారస్ ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు...కాంట్రాక్ట్ కార్మికులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున పరిహారం త్వరలో అందించనున్నారు. అలాగే దహన సంస్కారాలకు రూ.75 వేల చొప్పున అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.
లారెస్ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/mY8ke1AvpJ
— JanaSena Party (@JanaSenaParty) December 26, 2022