Pawan Kalyan : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి ప్రకటన.. పవన్ కల్యాణ్ స్పందన ఇదే
- IndiaGlitz, [Friday,April 14 2023]
ఇప్పటికిప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే . ప్రస్తుతానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేస్తున్నామని.. ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని ఫగ్గన్ సింగ్ తెలిపారు. ప్లాంట్‌లో ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ పెట్టామని.. దీనిపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ ఉక్కు కార్మాగారం ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే వుండాలని కోరారు. తెలుగువారి భావోద్వేగాలతో స్టీల్ ప్లాంట్ ముడిపడి వుందని పవన్ గుర్తుచేశారు. 32 మంది అమరుల ప్రాణ త్యాగాలతో.. ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీ విశాఖకు వచ్చిందని ఆయన తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కోసం రైతులు భూములు త్యాగం చేశారు :
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటన వచ్చిన వెంటనే తాను వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్‌తో కలిసి చర్చించానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమిత్ షాని కలిసి.. ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని .. నేటి వరకు ఈ విషయంలో సెటిల్‌మెంట్ జరగలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని..జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా నిలుస్తామన్నారు. దీనిపై భారీ బహిరంగ సభ నిర్వహించి.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన పవన్ తెలిపారు. అయినా దీనిపై వైసీపీ నేతలు స్పందించడం లేదన్నారు.
బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారే కానీ కాపాడతామని చెప్పలేకపోయారు :
జనసేన పార్టీ ప్రతి సందర్భంలోనూ విశాఖ ఉక్కును పరిరక్షించాలని కేంద్రానికి బలంగా చెప్పామని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిపై కొద్దిరోజుల కిందట పొరుగు రాష్ట్రమైన తెలంగాణ స్పందించిందని చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేశారే తప్పించి.. విశాఖ ఉక్కును కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్ధితిలో పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు బలపడుతుందని తాను భావిస్తున్నట్లు జనసేనాని చెప్పారు.
విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2023
• కేంద్ర మంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉంది
• రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/zvIu85UV4x