మత్స్యకార అభ్యున్నతి సభ: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో పవన్‌కు ఘనస్వాగతం
- IndiaGlitz, [Sunday,February 20 2022]
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా హాజరై పవన్‌కు ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్.. రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. సభ ముగిసిన అనంతరం పవన్.. నరసాపురం నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేవంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మత్స్యకారుల కోసం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోన్న 217 జీవోపై ప్రశ్నించడానికి పవన్ నరసాపురం వస్తున్నారు.
జనసేనాని పర్యటనకు మరో కారణం కూడా లేకపోలేదు. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని ఆయన అధిష్టానానికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో నరసాపురంలో ఎప్పుడైనా ఉపఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో అక్కడ పార్టీ పటిష్టతే లక్ష్యంగా జనసేనాని పావులు కదుపుతున్నారు.