రాయలసీమ పర్యటనకు సిద్ధమైన జనసేనాని
- IndiaGlitz, [Tuesday,November 26 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం.. రెండు చోట్ల పోటీ చేసినా ఒక్కటంటే ఒక్కచోట కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవలేదు. దీంతో రానున్న పంచాయితీ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న పవన్.. ఆ దిశగా ఇప్పట్నుంచే తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కోస్తాంధ్రలో పర్యటన ప్రారంభించిన ఆయన.. దాదాపు అన్ని జిల్లాల నేతలు, ద్వితియశ్రేణి నాయకులు, కార్యకర్తలతో టచ్‌లోకి వెళ్లారు. ఇవన్నీ అటుంచితే మరోవైపు.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
పర్యటన ఎందుకు..!?
అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారి ప్రతినిధులను పవన్ ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
కడప జిల్లాలో ఇలా..!
3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేస్తారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు.