డాక్టర్లు చికిత్స చేస్తారా, అంబులెన్స్‌లు పంపుతారా.. సర్కార్ వైఫల్యంతోనే ఇలా : రుయా ఘటనపై పవన్ ఆవేదన

  • IndiaGlitz, [Wednesday,April 27 2022]

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ‘‘అంబులెన్స్’’ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడంతో శ్రీనరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూసినట్లు పవన్ చెప్పారు. చనిపోయిన బిడ్డను భుజంపైన వేసుకొని 90 కి.మీ. బైక్ మీద వెళ్లిన ఆ ఘటన తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. బిడ్డను కోల్పోయిన శ్రీనరసింహ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎమ్‌వో సరస్వతీదేవిని బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్‌ చేయగా.. సూపరింటెండెంట్‌ భారతికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని జనసేనాని ఫైరయ్యారు.

‘‘విధుల్లో ఉండే వైద్యులు చికిత్స చేయాలా? లేదా అంబులెన్సులు సమకూర్చాలా?ఆస్పత్రి పరిపాలనా విభాగం పటిష్టం చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు.. రుయా ఆస్పత్రిలోనే కరోనా సమయంలో ఆక్సిజన్ లేకపోవడంతో 30 మంది మృత్యువాత పడ్డారు. కడప రిమ్స్‌లో విద్యుత్ కోతలతో పిల్లలు మృతి చెందారు. వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత గురించే నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ బలంగా మాట్లాడితే వేధించారు. ఆ వేదనతోనే ఆయన చనిపోయారు. ఈ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య రంగం మీద ఏపాటి శ్రద్ధ చూపిస్తుందో అర్థమవుతోంది. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆస్పత్రుల చుట్టూ రకరకాల మాఫియాలు తయారయ్యాయి. వాటిపైనా, వారిని పెంచి పోషిస్తోన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.

ఏం జరిగిందంటే..

అన్నమయ్య జిల్లా చిట్వేలి గ్రామంలో మామిడితోటలో కూలీగా పనిచేసే వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే ఆ బాలుడి కిడ్నీ, కాలేయం పనిచేయకపోవడంతో సోమవారం రాత్రి 11గంటల సమయంలో మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా రూ.10 వేలు అవుతుందని చెప్పారు. నిరుపేద కూలీ కావడంతో అంత మొత్తం భరించలేనని వాపోయాడు. దీంతో ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.

అయితే బయటి అంబులెన్స్‌లను లోపలికి రానిచ్చేది లేదని రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు వాదనకు దిగి తిరిగి వెనక్కి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని పట్టుబట్టారు. చివరికి బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని 90 కిలోమీటర్ల దూరంలో వున్న స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నివేదిక ఆధారంగా ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎమ్‌వో సరస్వతీదేవిని సస్పెండ్‌ చేయగా.. సూపరింటెండెంట్‌ భారతికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. అంతేకాకుండా బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకొన్న అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More News

కేజీఎఫ్ మేకర్స్ చేతుల్లో డా. రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ.. లుక్ వైరల్

‘కేజీఎఫ్ 2’ సూపర్‌హిట్ కావడంతో చిత్రబృందం సక్సెస్ జోష్‌లో వుంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో

తెలంగాణలో కొలువుల జాతర: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్‌తోనే ఎంపిక

తెలంగాణలో 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

'సిద్ధ' పాత్ర చరణ్‌కు బదులు పవన్‌ చేసుంటే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఒకరు వృద్ధ బానిస.. మరొకరు యువ బానిస, కుక్కల్లా మొరగొద్దు : అంబటి, గుడివాడలకు జనసేన నేతల వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎవరికో దత్తపుత్రుడు, దగ్గరి పుత్రుడు అంటున్న వైసీపీని 15 సీట్లకే పరిమితం చేస్తామని హెచ్చరించారు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్.

వ్యవసాయం అంటే తెలియదు.. మీరు అగ్రికల్చర్ మినిస్టర్ : కాకాణిపై జనసేన నేత కిషోర్ ఆగ్రహం

ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం భరించలేకే తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ వ్యక్తిగత విమర్శలు