Pawan Kalyan :మైడియర్ వాట్సన్ .. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పు , జగన్ టార్గెట్గా వాలంటీర్లపై పవన్ మరో ట్వీట్
- IndiaGlitz, [Sunday,July 23 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేసే వరకు వ్యవహారం వెళ్లింది. అయినప్పటికీ పవన్ ఏమాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. వాలంటీర్లతో పాటు జగన్ ప్రభుత్వంపై తన దూకుడును మరింత పెంచారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు పవన్. అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రశ్నలు సంధించి వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లకు బాస్ ఎవరు, ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, జనం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి అధికారం వారికి ఎవరిచ్చారు అంటూ పవన్ ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వుంటే అది క్రైమ్ అంటూ గతంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ షేర్ చేశారు.
అలాగే.. వాలంటర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించడంపైనా శనివారం పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల విధులు, ఓటర్ల జాబితాను తనిఖీ చేస్తున్న వాలంటీర్ల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పవన్ మండిపడ్డారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సీఈసీని కోరారు.
#MyDataMyPrivacy :
— JanaSena Party (@JanaSenaParty) July 23, 2023
దీనికి నీ సమాధానం ఏంటి జగన్? ఆధార్ లాంటి డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండకూడదు అని నువ్వు చెప్పలేదా??pic.twitter.com/uLAtScVwvo