Pawan Kalyan: సన్మానాలే కాదు, భరోసాగా నిలవడంలోనూ మోడీ ఆదర్శనీయులు : పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Monday,August 08 2022]
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బ్రిటన్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో తృటిలో బంగారు పతకం చేజారిన పూజా గెహ్లట్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాన్ని పవన్ గుర్తుచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారని.. అదే అపజయం వెంటాడినపుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారని జనసేనాని వ్యాఖ్యానించారు. నిజానికి సత్ఫలితాలు వచ్చినప్పుడు చేసే సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారని పవన్ అన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆయన గుర్తుచేశారు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడానికో, దేశానికి విజయాలు సాధించిపెట్టడానికో పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ త్రుటిలో విజయానికి దూరమైన వారికి ప్రధాని భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుందని పవన్ కల్యాణ్ కొనియాడారు.
పూజా గెహ్లాట్‌ను ఓదార్చి ప్రధాని కదిలించారు :
బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళల కుస్తీ పోటీలలో బంగారు పతకం చేజారి కాంస్యం మాత్రమే దక్కించుకున్న పూజ గెహ్లట్ దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలని విలపిస్తున్న వీడియోను మోదీ చూసి ఆమెను ఓదార్చిన తీరు మానవీయంగా ఉందన్నారు. నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చిందని.. క్షమాపణలు కాదని నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాము... నీ విజయం మాకో అద్భుతం అని పూజాకు ప్రధాని మోడీ పంపిన సందేశం కదిలించేలా ఉందన్నారు
ఆ క్రీడాకారులను తండ్రిలా అనునయించారు :
ఈ సందర్భంలోనే కాదు పలు సంఘటనలలో ఆయన చూపిన ఇటువంటి ఓదార్పు మనసుకు స్వాంతన చేకూరుస్తాయని పవన్ పేర్కొన్నారు. టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మన దేశ హాకీ మహిళా టీం ఫైనల్ చేరుకోవడంలో విఫలమైనప్పుడు మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించిందని జనసేనాని గుర్తుచేశారు. ఆ సందర్భంలో కూడా ప్రధాని మోడీ మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారని పవన్ తెలిపారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారని... చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ మోదీ మన శాస్త్రవేత్తలకు గుండె ధైర్యాన్ని నింపారని జనసేనాని అన్నారు.
నాటి ఇస్రో చీఫ్ శివన్‌ను గుండెలకు హత్తుకున్నారు :
ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్తవేత్తలను గేలి చేసి.. అవమానించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ శివన్‌ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి.. భవిష్యత్తుపై దృష్టిపెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కుడా మనం మరిచిపోలేని సంఘటనగా పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నానని... పూజా గెహ్లట్ తో పాటు కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులందరికీ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పరాజయంలో ఓదార్పే ఊపిరి
— JanaSena Party (@JanaSenaParty) August 8, 2022
ప్రధానమంత్రి @PMOIndia శ్రీ @narendramodi గారు ఆదర్శనీయం pic.twitter.com/Y64qDim7Tr