NTR Satha Jayanthi: ఆయనో అభ్యుదయవాది.. ఎన్టీఆర్‌కు పవన్ కల్యాణ్ ఘన నివాళులు

  • IndiaGlitz, [Saturday,May 28 2022]

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు కూడా ఒకరని ప్రశంసించారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయవాదిగా ఎన్.టి.ఆర్. నిలిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు.

అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నానని అన్నారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు తనను ఎంతగానో ఆకట్టుకునేదని.. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అంజలి ఘటిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తెలుగు జాతి కీర్తి కిరీటం : ఎన్టీఆర్‌కు మెగాస్టార్ నివాళి

అటు అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిరంజీవి:

ఇకపోతే.. అన్నగారితో చిరంజీవికి మంచి అనుబంధమే వుంది. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కలిసి నటించారు కూడా. ‘తిరుగులేని మనిషి’ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ నుంచి ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాన‌ని చిరంజీవి ప‌లు సంద‌ర్భాల్లో తెలియజేశారు. అలాగే చిరంజీవి మామ‌య్య‌.. ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య‌కు సైతం ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి - సురేఖల నిశ్చ‌తార్థానికి కూడా ఎన్టీఆర్ హాజరయ్యారు.