Ladakh Accident : మాటల కందని విషాదం.. లఢఖ్ ప్రమాదంలో సైనికుల దుర్మరణంపై పవన్ దిగ్భ్రాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
లఢఖ్ వద్ద బస్సు నదిలో దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం పాలైన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ హిమ పర్వతాలు, అత్యంత సంక్లిష్ట వాతావరణంతో నిండివుండే లఢఖ్‌లో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి చెందిన దుస్సంఘటన నా మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు. అలాగే మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడడం మన దురదృష్టంగా భావిస్తున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సైనికుల ప్రాణాలు అపురూపం :
మానవ ప్రాణాలు ఎంతో విలువైనవి, అందులోను సైనికుల ప్రాణాలు మరెంతో అపురూపమైనవని ఆయన అన్నారు. దేశం కోసం తమ సర్వసౌఖ్యాలు విడనాడి, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలకు ఏమి తిరిగిచ్చి రుణం తీర్చుకోగలమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అటువంటి జవాన్లు దేశ రక్షణ కర్తవ్యంలో భాగంగా తమ శిబిరం నుంచి వాహనంలో ప్రయాణిస్తూ మార్గమధ్యలో నదిలోకి జారిపడి ప్రాణాలు కోల్పోవడం మాటలకు అందని విషాదమన్నారు.
అమరులకు లెక్కలు వేసుకోకుండా సాయం చేయాలి:
అమరులైన వీరులకు గౌరవ వందనం అర్పిస్తున్నానని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లు పవన్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమరుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు,వారి స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెక్కలు వేయకుండా ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు . అమరుల కుటుంబాలకు ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలతోపాటు భారతీయులందరిపై ఉందని జనసేన అధినేత గుర్తుచేశారు.
ప్రమాదం జరిగిందిలా:
శుక్రవారం ఉదయం పార్థాపూర్ శిబిరం నుంచి 26 మంది సైనికులు ఆర్మీ వాహనంలో హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో టుర్టుక్ సెక్టార్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ అదుపుతప్పి షియోక్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన జవాన్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యం ప్రకటించింది. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు, పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments