Pawan Kalyan : చివరి శ్వాస వరకు గానం .. కచేరీ ముగిశాకే ప్రాణం వదిలారు : కేకే మృతి పట్ల పవన్ విచారం

  • IndiaGlitz, [Wednesday,June 01 2022]

ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే మరణం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన హఠాన్మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా కేకే మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నేను నటించిన ఎన్నో సినిమాల్లో పాడారు:

కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అకాల మరణం బాధను కలిగించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను నటించిన చిత్రాల్లో కేకే ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. ఖుషీ చిత్రంలోని ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైందని.. అందుకు కె.కె. గాత్రం ఓ ప్రధాన కారణమని పవన్ అన్నారు.

చివరి శ్వాస వరకు పాడుతూనే వున్నారు:

‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా’, ‘బాలు’లో ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను ఆయన ఆలపించారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ పాటలు శ్రోతలను ఆకట్టుకోవడమే కాకుండా.. సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయని పవన్ ప్రశంసించారు. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే కేకే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరమని.. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారని జనసేనాని అన్నారు. కె.కె. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ ప్రార్ధించారు.