Pawan- CBN: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో కలకలం, పొత్తులపై ఇద్దరి స్పందనా ఇదే
- IndiaGlitz, [Sunday,January 08 2023]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాబు నివాసానికి చేరుకున్న పవన్ ఆయనతో దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని.. ప్రజల వద్దకు విపక్ష నేతలు వెళ్లకుండా నియంత్రించేందుకే జీవో నెంబర్ 1ని తెచ్చారని పవన్ ఆరోపించారు. మా మీటింగ్‌లకు తామే లాఠీలు పెట్టుకోవాలా.. అటువంటప్పుడు ప్రభుత్వం, పోలీసులు ఎందుకని పవన్ ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాటలకు పోలీసుల వైఫల్యమే కారణమని.. వైసీపీ నేతలు చేసే విమర్శలకు ఈ నెల 12న జరిగే సభలో సమాధానమిస్తానని పవన్ చెప్పారు.
మూడు వేల మందితో నన్ను అడ్డుకున్నారు : చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ విధానాలపై ఎలా పోరాడాలనే దానిపైనే పవన్‌తో చర్చించినట్లుగా చెప్పారు. ఎన్నికలు, పొత్తులపై తర్వాత మాట్లాడతామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. తనకు సంఘీభావం చెప్పేందుకు పవన్ రావడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఆంక్షల పేరుతో పవన్‌ను విశాఖలో హింసించారని... ఇప్పటంలోనూ అలాగే చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని.. నేరాలు, అవినీతి, వ్యవస్థలను నాశనం చేయడం వైసీపీకి అలవాటని ఆయన దుయ్యబట్టారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అడ్డుకోవడానికి మూడు వేల మంది పోలీసులను అడ్డుపెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు.
ఎమర్జెన్సీలోనూ పోలీసులు గోడలు దూకలేదు :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్న సమయంలో అసెంబ్లీలో తాను మాట్లాడేందుకు నిలబడితే ఆయన కూర్చొనేవాడని, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం సైకోలా వ్యవహరిస్తున్నాడని.. ఆయన వల్ల గత నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలోనూ పోలీసులు గోడలు దూకి రాలేదని.. కానీ జగన్ పాలనలో మాత్రం పోలీసులు రాత్రిపూట గోడలు దూకుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.