Pawan Kalyan:గద్దర్‌ను పరామర్శించిన పవన్ .. రాజకీయం ఓ పద్మవ్యూహం , జాగ్రత్త : జనసేనానికి సూచనలు
- IndiaGlitz, [Saturday,July 29 2023]
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. గద్దర్‌ను కలుసుకుని ఆరోగ్య వవరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొన్ని అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గద్దర్ ఏ కారణం చేత అనారోగ్యానికి గురయ్యారన్నది తెలియరాలేదు.
మరోవైపు.. ప్రస్తుతం రాజకీయాల్లో వున్న పవన్ కల్యాణ్‌కు గద్దర్ కీలక సూచనలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయం పద్మవ్యూహం వంటిదని అప్రమత్తంగా వుంటూ ముందుకు వెళ్లాలని గద్దర్ సూచించారు. దేశంలో యువత అత్యధికంగా వున్నారని.. అలాంటి వారికి పవన్ వంటి నేతల నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈసారి విజయం నీదేనని ఓ అన్నగా ఆకాంక్షింస్తున్నట్లు జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది.
ఇదిలావుండగా.. గద్దర్ ఈసారి జరిగే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో వున్న ఆయన కొద్దిరోజుల క్రితం ‘‘గద్ధర్ ప్రజా పార్టీ’’ పేరుతో పార్టీని స్థాపించారు. దీనిని ఎన్నికల సంఘం వద్ద కూడా ఆయన రిజిస్టర్ చేయించారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో మధ్యలో పిడికిలి గుర్తు వుండేలా గద్దర్ పార్టీ జెండాను కూడా రూపొందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.