Pawan Kalyan : గేర్ మార్చిన పవన్.. హైదరాబాద్‌కు కాదు, విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెజవాడకు
- IndiaGlitz, [Monday,October 17 2022]
వైసీపీ నేతలు జోగి రమేశ్, ఆర్కే రోజా, వైవీ సుబ్బారెడ్డిల కాన్వాయ్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడితో గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన - వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమానికి కూడా అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనలతో విశాఖలో పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చి పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన నోవాటెల్ హోటల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కిటికీ అద్దంలోంచి ఆయన అభిమానులకు అభివాదం చేశారు. అలాగే ఇటీవల మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు కూడా మీడియా సమక్షంలోనే ఆర్ధిక సాయం అందజేశారు పవన్ కల్యాణ్.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న పవన్:
అయితే సోమవారం పవన్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తారని అంతా భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా వ్యూహాత్మకంగా వ్యవహారించారు పవన్. హైదరాబాద్‌కు కాకుండా విజయవాడ వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కి చేరుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఈ సందర్భంగా విశాఖలో రెండు రోజులుగా చోటు చేసుకున్న ఘటనలు, పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. బిశ్వభూషణ్‌తో భేటీ అనతరం పవన్.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు.
మంత్రులపై దాడి ఘటనలో 62 మంది జనసైనికులకు బెయిల్:
మరోవైపు.. విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తల్లో 62 మందికి రూ.10 వేల పూచీకత్తుపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తీవ్రస్థాయి అభియోగాలు వున్న 9 మందికి మాత్రం 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్ట్ అయిన 71 మందిని ఆదివారం రాత్రి విశాఖలోని 7వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. మొత్తం 92 మందిపై కేసులు నమోదు చేయగా.. వీరిలో 71 మందిని అరెస్ట్ చేసినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.