సైనికులు, రైతుల స్థాయి కార్మికులది .. పవన్ కల్యాణ్ ‘‘మే డే’’ శుభాకాంక్షలు
- IndiaGlitz, [Sunday,May 01 2022]
మే డేను పురస్కరించుకుని కార్మిక ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కార్మికుల స్వేదం చిందకపోతే ఏ దేశమైనా, ఏ జాతయినా అభివృద్ధి పథాన పయనించజాలదు. ఎక్కడ శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తుందో... ఎక్కడ కార్మికులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారో అక్కడ సమాజం సిరి సంపదలతో అలరారుతుంది. కుల, జాతి, వర్గ భేదాలకు అతీతంగా కార్మికులందరూ ఐక్యంగా జరుపుకొనే వేడుక మేడే. దేశాన్ని కాపాడే సైనికులు, అందరికీ అన్నంపెట్టే రైతులతోపాటు ఆ స్థాయిలో గౌరవించవలసిన వారు మన కార్మికులు. దేశ సౌభాగ్యం కోసం ఎండనకా వాననకా, కాలాలకు అతీతంగా నిద్రాహారాలు మాని దేశం కోసం అహరహరం కష్టించి, శ్రమించే కార్మికులందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన మేడే శుభాకాంక్షలు. కార్మిక లోకమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ ఆకాంక్షించారు.
మే డే పుట్టుక వెనుక:
1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు శ్రమ తగిన గుర్తింపు, పనికి తగిన వేతనం, పనిగంటల తగ్గింపు డిమాండ్‌తో పారిశ్రామికవేత్తలపై తిరగబడ్డారు. రోజుకు 18 గంటలు, 16 గంటలు పని చేయలేమని, బానిసత్వంతో బతకలేమని ఉద్యమించారు. ఈ ఉద్యమంలో వందలాది మంది కార్మికులను పెట్టుబడిదారులు పొట్టనబెట్టుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. ఈ పోరాటం తర్వాతే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోజుకు 8 గంటల పనిహక్కును సాధించుకున్నారు. నాటి అమరుల త్యాగానికి ప్రతీకగా ఏటా మే 1వ తేదీన ‘ప్రపంచ కార్మికుల దినోత్సవం’ జరుపుకుంటున్నారు.
సంపద సృష్టికర్తలు మన కార్మికులు - JanaSena Chief Shri @PawanKalyan #MayDay pic.twitter.com/6QbJg5H3NM
— JanaSena Party (@JanaSenaParty) May 1, 2022