Janasena Chief Pawan Kalyan:ఇంట్లో కూర్చుంటే అధికారం రాదు .. మీరు బలపడండి, పార్టీని బలోపేతం చేయండి : నేతలకు పవన్ పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలు, సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం కార్మికులు, కర్షకులు, చేతి వృత్తులవారు, వ్యాపారులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను విని, స్వయంగా నోట్ చేసుకున్నారు. అన్నీ రంగాలకు వైసీపీ పాలనలో తీరని నష్టం జరుగుతోందని, సంక్షేమం ముసుగు వేసి అన్నీ రంగాలను డొల్ల చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు, నిధులు అన్నీ ఆగిపోయాయని జనం వాపోయారు. ఒక్కొక్కరితో మాట్లాడి అందరి బాధలను పవన్ కళ్యాణ్ సావధానంగా విన్నారు.
అందరినీ కలుపుకుని వెళ్లండి :
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం , రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పవన్ కీలక సూచనలు చేశారు. ఇంట్లో కూర్చుని గెలిచేయాలి, అధికారం వచ్చేయాలంటే కుదరదన్నారు. నేతలు మరింత మందిని కలుపుకొని ముందుకు వెళ్లాలని... అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ ఉన్నతి కోసం బలంగా కష్టపడాలని.. మనందరిలో సమన్వయం అనేది ప్రధానంగా వుండాలని ఆయన సూచించారు. నిజాయతీని నమ్ముకున్న పార్టీ మనదని.. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
టీడీపీ, వైసీపీలాగా అన్ని అనుకూల పరిస్ధితులు లేవు :
కులాలు, వర్గాలను దాటి రాజకీయం చేయాలని.. ఒక కులానికి ఒక పార్టీ అన్న పద్దతి ఉండకూడదని సూచించారు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని.. నాయకత్వమంతా ఒకే తరహా ఆలోచనలో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా కులాలన్నీ కలసికట్టుగా నడవాలన్నదే తన ఆలోచన అన్నారు. తాను విలువలు చెప్పనని, వాటిని పాటించే వ్యక్తినని పవన్ స్పష్టం చేశారు. కొత్తతరం నాయకుల్ని తీసుకురావాలన్నదే తన ఆకాంక్షఅని.. తెలుగుదేశం, వైసీపీ లాంటి పార్టీలకు ఇన్స్టెంట్గా అనుభవం ఉన్న నాయకులు దొరికేశారని ఆయన గుర్తుచేశారు. వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ఎదురెళ్తున్నామని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ముందుగా నియోజకవర్గాల్లో వున్న సమస్యలు తెలుసుకోవాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments