Pawan Kalyan:ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇన్ని ఘోరాలా.. జనసేన వస్తే "సుభిక్ష ఆంధ్రప్రదేశ్": పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా గురువారం అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రమైన అమలాపురంలో కేవలం ఏరియా ఆసుపత్రి మాత్రమే వుందన్నారు. అందులోనూ సరైన వసతులు, సిబ్బంది లేరని , ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థను వైసీపీ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. కోనసీమ చూడటానికి అందాల మేడలా కనిపిస్తున్నా, తాగే నీరు కూడా సక్రమంగా ఉండటం లేదన్నారు. ఆక్వా కాలుష్యం భూమిలోకి వెళ్లి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని.. వాటిని తాగిన మహిళలకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వారికి మందులు పనిచేయడం లేదని, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోతోంది.. స్థానిక పాలకులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ చిన్న పిల్లాడట :
2019 ఎన్నికల ముందు జగన్ తమ ప్రభుత్వం రాగానే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జీపీఎస్ అంటూ రకరకాల నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే జగన్ చిన్నపిల్లాడని తెలిసోతెలియకో హామీ ఇచ్చాడని కొందరు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ గురించి ప్రశ్నిస్తే నాయకులకు ప్రభుత్వం నుంచి బెదిరింపులు, తిట్లు, శాపనార్థాలే ఎదురవుతున్నాయన్నారు. జనసేన ప్రభుత్వంలో సీపీఎస్ రద్దుపై నిపుణులతో కమిటీ వేసి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు రూ.2500 కోట్లను జగన్ తన అవసరాలకు మళ్లించేసుకున్నారని.. వారి ఎస్.ఎల్, టి.ఏ., డి.ఏ.లు బకాయిలు పెట్టేశారని ఆయన చురకలంటించారు. ఈ మొత్తమే రూ.1300 కోట్లు ఉంటాయన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు.. 30 మంది ఎంపీలు , అయినా జనసేన అంటే భయం :
2019లో ఒక్క ఛాన్స్ అని పదేపదే కోరిన జగన్ మాటలను నమ్మిన జనం.. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు ఉన్న మీరు బలవంతులు కదా అలాంటి వారికి జనసేన అంటే భయమెందుకని పవన్ ప్రశ్నించారు. జనసేన నిజాయతీ గల పార్టీ అని, తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నించే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. అందుకే మనమంటే వారికంత భయమన్నారు. మనం పోరాటం చేస్తే వెంటనే రైతులకు డబ్బులు వేస్తారు, రోడ్లను బాగు చేస్తారు, అప్పటి వరకు కాని పనులను సైతం పూర్తి చేస్తారని పేర్కొన్నారు. జనసేన బలగంలోని తెగువ, పోరాటం, తిరగబడే సత్తా, ప్రశ్నించే శక్తి, పదిమందిని కలుపుకొని వెళ్లే ప్రేమ అంటేనే పాలకులకు భయమని పవన్ పేర్కొన్నారు.
కోనసీమ అల్లర్ల వెనుక ప్రభుత్వ కుట్ర :
కోనసీమ అల్లర్ల విషయంలో ప్రభుత్వం నాటకం ఆడుతోందని , కేసులను ఎత్తి వేసినట్లు ప్రకటనలు ఇస్తూనే క్షేత్రస్థాయిలో విభిన్న పంథాను అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. 250 మంది యువతకు కేసుల వల్ల భవిష్యత్తు లేకుండా పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెడతామంటే అంతా స్వాగతించేవాళ్లమన్నారు. ఇతర జిల్లాలకు పేరు పెడుతున్నపుడు తీసుకోని అభిప్రాయ సేకరణ, కేవలం అంబేద్కర్ పేరు పెట్టినపుడు తీసుకోవడం ఎందుకు, దీనిలో వైసీపీ కుట్రకోణం ఉందని జనసేనాని ఆరోపించారు.
కొబ్బరి రైతులకు అండగా వుంటాం:
రైతాంగం ప్రతి బస్తాకు రూ.1530ల గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటోందని ఆయన గుర్తుచేశారు. అంతా సవ్యంగా ఉంటే రూ.10 వేల నష్టం వస్తోందని, కౌలు రైతులకు రూ.20 వేలు నష్టం వస్తోందని రైతులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతు అప్పులతో మునిగిపోవడం చింతించాల్సిన విషయమన్నారు. రైతులకు కనీస సహాయం వైసీపీ ప్రభుత్వంలో అందడం లేదని.. ఆఖరికీ కాలువల్లో సిల్టు తీయకపోవడంతో చివరి ఎకరాకు నీరు అందని పరిస్థితి ఉందన్నారు. వైసీపీకి ఓటు వేసిన రైతులు సైతం తనను కలిసి తప్పు చేశామని, పశ్చాత్తాప పడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కొబ్బరి రైతులకు జనసేన అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కొబ్బరి రైతులకు పూర్తిస్థాయి ధర దక్కేలా, ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు వచ్చేలా తాను చొరవ తీసుకుంటాననని ఆయన స్పష్టం చేశారు. ఈసారి జనసేన ప్రభుత్వానికి రైతాంగం అండగా నిలబడాలని.. కచ్చితంగా రైతాంగం చిరునవ్వులు చిందించే సుభిక్ష ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout