Pawan Kalyan:ఏపీలో ‘ముందస్తు’ ఖాయం.. నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నవంబరు, డిసెంబరులోనే వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ పెద్దల సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం వుందన్నారు. ఈసారి కచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతులోనే ఉంటుందన్నారు. యువతరం, ప్రజలు ఆవేశంతో కాదు.. ఆలోచించి జనసేనను ఆశీర్వదించాలని పవన్ పిలుపునిచ్చారు. అద్భుతమైన పాలన అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎవరు బతికిస్తారో, దారి చూపుతారో నిండు మనసుతో ఆలోచించి బలంగా గ్లాసు గుర్తుపై ఎన్నికల ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
పంచాయతీ నిధులు ఏమవుతున్నాయి :
వైసీపీ పాలనలో పంచాయతీలకు నిధులు లేవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేరళలో పంచాయతీలకు సుమారు 40 శాతం మేర నిధులు కేటాయిస్తూ వుండటం వల్ల పక్కగా స్థానిక సంస్థల పాలన ఉంటుందన్నారు. కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకు రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు వస్తాయని పవన్ తెలిపారు. అవి అందకపోవడంతో కనీసం పారిశుద్ధ్య పనులు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రతి ఇంటి నుంచి వసూలు చేస్తున్న రూ.90 చెత్త పన్నును ఏం చేస్తున్నారో తెలియదని పవన్ కల్యాణ్ చురకలంటించారు. జనసేన ప్రభుత్వంలో పంచాయతీల నిధులు కచ్చితంగా వారికి అందేలా పనిచేస్తామని.. దీనికి సమగ్ర ప్రణాళికను ప్రకటిస్తామన్నారు.
జనసేన హయాంలో ఇసుక దోపిడీకి చెక్:
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించిన రూ.450 కోట్లు ఎటు పోయాయో తెలియదని పవన్ ఆరోపించారు. ఇసుక పాలసీ పేరుతో వైసీపీ ప్రభుత్వం 3 కంపెనీలకు ఇసుక నిర్వహణ కట్టబెట్టిందని.. చిత్తూరుకు చెందిన ఓ బడా నాయకుడి కంపెనీలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అసలు కంపెనీలను పక్కన పెట్టి వైసీపీ నేతలు ఆజమాయిషీ చెలాయిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనసేన ప్రభుత్వంలో ఇసుకపై ఆధారపడిన వారికి కాంట్రాక్టులు కేటాయిస్తామని.. పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇసుక కాంట్రాక్టులను సైతం దానిపై ఆధారపడిన వారికే ఇస్తామని.. మైనింగ్ వనరుల దోపిడీని సాగనివ్వమని పవన్ పేర్కొన్నారు. పోలవరం పూర్తి కావాలంటే జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పోలవరం పూర్తి కోసం మా ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలిపారు. కేంద్రంతో సఖ్యతగానే నడుచుకుంటామని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్ల ఊరుకోబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దివ్యాంగులకు పూర్తిగా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి :
ప్రజా సమస్యల కోసం వీధి పోరాటాలు చేశామని.. మీ కోసం చట్టసభల్లో పోరాడే అవకాశం ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. గొప్ప దేశభక్తుల స్ఫూర్తిని నిలువెల్లా నింపుకున్న మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలన్నారు. పార్టీ కార్యకర్తల ధనానికే రూపాయి రూపాయి లెక్క చెప్పే తాను, ప్రజా ధనానికి అంతే కచ్చితంగా లెక్క చూపిస్తానని పవన్ స్పష్టం చేశారు. రూపాయి అవినీతి లేకుండా పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments