Pawan Kalyan:పరిహారం ఇస్తామని .. ఇప్పుడు భూమే లేదంటున్నారు : పవన్ వద్ద ఏలేరు భూ నిర్వాసితుడి ఆక్రందన
Send us your feedback to audioarticles@vaarta.com
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన జనవాణి - జనసేన భరోసాకు సమస్యల వెల్లువెత్తాయి. రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు, భిన్న వర్గాల ప్రజల ఆవేదనలను తెలుసుకున్నారు జనసేనాని. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు జడివానలా వెల్లువెత్తాయి. పిఠాపురం నియోజకవర్గ పరిసరాల నుంచి వివిధ సమస్యలపై 34 మంది అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో కష్టాన్ని పవన్ కల్యాణ్‌కు చెప్పుకున్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణను పాలకులు అటకెక్కించేశారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో రైతులు, గొల్లప్రోలు మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అతను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాడు. ఉన్నపళంగా వరదలు వస్తే సుమారు 6 వేల మంది ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వస్తోందని అతను తన బాధను పంచుకున్నాడు.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య :
ఏలేరు ఆధునీకరణ పేరిట భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని.. పరిహారం అడుగుతుంటే ఇప్పుడు నోటిఫికేషన్ గడువు ముగిసిందంటున్నారని మరో నిర్వాసితుడు తన వ్యధను పవన్ దృష్టికి తీసుకెళ్లాడు . మత్స్యకారుల్ని ముందుకు నడిపిస్తానన్న ముఖ్యమంత్రి మా జీవితాలను ఏడెనిమిది అడుగులు వెనక్కి పోయేలా చేశారని అతను విమర్శించాడు. సముద్రపు కోతకు బలవుతున్న ఉప్పాడ తీర ప్రాంత వాసుల గోడు పవన్‌కు చెప్పుకున్నారు. విద్యాలయాల్లో గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని ఓ యువకుడు, దివ్యాంగుల పట్ల పాలకులు చులకన భావంతో ఉన్నారని మరొకరు జనసేనానితో బాధలు పంచుకున్నారు. తమకు జనసేన నుంచి భరోసా కావాలని.. శ్మశానం లేక రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేసుకోవాల్సి వస్తోంది సార్ అంటూ పవన్‌కి వివరించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు.
నా భూమిని తగ్గించి చూపుతున్నారు :
పవన్ కుమార్ అనే భూ నిర్వాసితుడు తమకు జరుగుతున్న అన్యాయంపై పవన్ కల్యాణ్‌కు అర్జీ సమర్పించారు. ఏలేరు ఆధునీకరణ పేరిట భూసేకరణకు తమ భూములు తీసుకుంటామంటూ నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. అయితే అప్పటి లెక్క ప్రకారం ఎకరాకి రూ. 9 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారని, ఇప్పుడు నోటిఫికేషన్ గడువు తీరిపోయింది పరిహారం రాదు అంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఆధునీకరణ పేరిట తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వకపోగా ఇప్పుడు జగనన్న శాశ్వత భూహక్కు పేరిట సర్వే చేపట్టి తన పట్టాలో ఉన్న భూమిని తగ్గించి చూపుతున్నారని అతను గొల్లుమన్నాడు. తనకు జరిగిన అన్యాయంపై స్పందనలో ఫిర్యాదు చేసినా, స్థానిక శాసనసభ్యుడికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అప్పటికీ ఇప్పటికీ ధరల్లో భారీగా మార్పు వచ్చిందని.. ఇప్పుడు అసలు ఉన్న భూమే లేదంటున్నారంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వరదొస్తే కట్టుబట్టలతో బయటికి :
గుండివిల్లి పోలీసు అనే మరో బాధితుడు ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ పనుల నిరవధిక వాయిదా కారణంగా పడుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్‌కు తెలియచేశారు. అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి అన్నట్లుగా ఏలేరు, సుద్దగడ్డ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు, గ్రామాల వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. సాగునీటి వ్యవస్, సరఫరా నియంత్రణ లేక వరదలు వస్తే వేలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయని పోలీసు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వస్తే ముంపు గ్రామాల్లో ఏటా సుమారు 7 వేల మంది కట్టుబట్టలతో ఇళ్లు ఖాళీ చేసి పోవాల్సి వస్తోందని పవన్‌కు వివరించారు. రూ. 240 కోట్లతో ఆధునీకీకరణ చేపట్టనున్నట్టు చెప్పారని..కానీ ప్రభుత్వాలు మారుతున్నా సమస్య పరిష్కారం మాత్రం దొరకడం లేదని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com