Janasena:జనసేనతోనే ఏపీకి పునర్వైభవం .. మన ప్రభుత్వంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలు, సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం కార్మికులు, కర్షకులు, చేతి వృత్తులవారు, వ్యాపారులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను విని, స్వయంగా నోట్ చేసుకున్నారు. అన్నీ రంగాలకు వైసీపీ పాలనలో తీరని నష్టం జరుగుతోందని, సంక్షేమం ముసుగు వేసి అన్నీ రంగాలను డొల్ల చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు, నిధులు అన్నీ ఆగిపోయాయని జనం వాపోయారు. ఒక్కొక్కరితో మాట్లాడి అందరి బాధలను పవన్ కళ్యాణ్ సావధానంగా విన్నారు.
వ్యవసాయ పనిముట్లు నిజమైన రైతులకు దక్కడం లేదు :
రాపర్తికి చెందిన ముప్పిడి అమర నారాయణ రెడ్డి అనే రైతు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు నిజమైన రైతులకు అందటం లేదని ఆయన వాపోయారు. కోత మిషన్లను సైతం పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం వల్ల ఖర్చు పెరుగుతోందని.. హేచరీలను నిర్వహించే వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కు వివరించారు. విద్యుత్ కోతలతోపాటు, విద్యుత్ సరఫరాలో తరచూ ఎదురయ్యే అవాంతరాలను జనసేనాని దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తోటకూర శివసత్యనారాయణ వివరించారు.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు :
దుర్గాడకు చెందిన వెలుగుల లక్ష్మణ్, గొల్లపల్లి శివబాబు అనే రైతులు పొట్టి మిర్చి రకం వేసిన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి భూములు కౌలుకు తీసుకొని బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు వేసిన శ్రమ మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పాడకు చెందిన పలివెల నానిబాబు అనే యువకుడు మాట్లాడుతూ చేపలు విక్రయించేవారికి అవసరమయ్యే తాటాకు బుట్టల్లాంటివి చేసుకొని తాము జీవిస్తామని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ వృత్తిలో ఉన్నవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు, రుణాలు రావడం లేదన్నారు. చేబ్రోలుకు చెందిన జయకృష్ణ అనే యువకుడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పెట్టడం ఎదురవుతున్న ఇక్కట్లను, సర్వేలో కొలతలు తేడా వస్తున్నాయని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
అన్ని రంగాల్లో కుప్పలు తెప్పలుగా సమస్యలు :
అనంతరం జనసేన అధినేత మాట్లాడుతూ .. మన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలసీలు ఉంటాయని హామీ ఇచ్చారు. అందరితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను విన్న తర్వాత అందరికీ అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. ప్రతి రంగంలోనూ సమస్యలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అందరి జీవితాలు నాశనం అయ్యాయని.. సంక్షేమం ఆశ చూపి ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం సాధించే దిశగా జనసేన ప్రభుత్వంలో పాలన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రజల జీవితాలు బాగు పడే నిర్ణయాలుంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అవుతారు అని జనసేనాని భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments