Pawan Kalyan: ఐదుగురు మహిళా కూలీల సజీవదహనం : పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
- IndiaGlitz, [Thursday,June 30 2022]
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఊహకందని విషాదం:
ఈ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని... వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం తన మనసుని కలచి వేసిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అది మానవ తప్పిదమా... నిర్వహణా లోపమా:
వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటాం మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అనే విషయం ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సి వుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని పవన్ కల్యాణ్ చురకలంటించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయి ఉంటున్నాయని.. అలాగే జనావాసాల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు ఐదు నిండు ప్రాణాలు పోయాయని గుర్తుంచుకోవాలన్నారు. తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
కూలి పనులకు వెళుతూ కానరాని లోకాలకు:
కాగా.. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం గుండంపల్లికి చెందిన ఆరుగురు మహిళా కూలీలు గురువారం పొలం పనుల కోసం దగ్గరలోని చిల్లకొండయ్యపల్లికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వారి ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని ఘటనతో వారు ఆటోలో నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమవ్వగా.. లక్ష్మీ అనే మహిళ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్ధితి కూడా విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.