Pawan Kalyan:నా మనుమడిని చంపి రోడ్డుపై పడేశారు .. అడిగితే బెదిరిస్తున్నారు : పవన్‌తో చెప్పుకున్న వృద్ధురాలు

  • IndiaGlitz, [Friday,August 18 2023]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వాడి వేడి విమర్శలు చేస్తూనే జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు పవన్ . నిన్న విశాఖలో జనవాణి - జనసేన భరోసా కార్యక్రమానికి వినతులు వెల్లువలా వచ్చాయి. దాదాపుగా 340 అర్జీలు పవన్ కళ్యాణ్ చెంతకు వచ్చాయి. ఈ పరిస్థితిని చూసి జనవాణి కార్యక్రమాన్ని మరో రెండు రోజుల పాటు విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినా పూర్తికావని స్వయంగా పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగా వున్న ఆయన.. జనసేన అండగా నిలబడుతుందని ధైర్యాన్ని ఇచ్చారు.

పిచ్చాసుపత్రికి పంపి చంపాలని చూస్తున్నారు :

గాజువాక డంపింగ్ యార్డ్ 16 గ్రామాల ప్రజల ఆరోగ్యాలను హరిస్తోందని బాధితులు వాపోయారు. డంపింగ్ యార్డ్‌ను పార్క్‌గా మారుస్తానన్న ఎమ్మెల్యే ఏకంగా యార్డు చుట్టూ ప్రహరీ గోడ కట్టించారని దుయ్యబట్టారు. కాకినాడకు చెందిన శ్రీమతి ఆరుద్ర తన కుమార్తె సాయిచంద్రకు ఆపరేషన్ నిమిత్తం ఇల్లు అమ్మకానికి పెడితే మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్, మరో కానిస్టేబుల్‌లు తనకే ఇల్లు అమ్మాలని వేధిస్తున్నారని.. చివరికి తమను పిచ్చాసుపత్రికి తరలించి చంపాలని చూస్తున్నారని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మినిమం టైం స్కేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రా యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కోరత తీవ్రంగా వుండటంతో పీహెచ్‌డీ చేస్తున్న వారితో పాఠాలు చెప్పిస్తున్నారని ఓ విద్యార్ధి పవన్‌కు తెలిపారు.

అసలు రైతుల ప్లేస్‌లో వైసీపీ నేతల పేర్లు :

పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో జగనన్న కాలనీల కోసం భూమిని సేకరించారని దీనికి పరిహారం చెల్లించే విషయంలో అధికార పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు తెలిపారు. జాబితా నుంచి అసలు రైతులను తొలగించి వైసీపీ నేతలు వాళ్ల పేర్లు పెట్టుకున్నారని.. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు జరిగిన ప్రిలీమినరీ పరీక్షలో ఐదు ప్రశ్నలు తప్పుగా రావడంతో రెండు మార్కుల తేడాతో దాదాపు 50 మంది అభ్యర్ధులు ఫిజికల్ టెస్టులకు దూరం అయ్యారని నిరుద్యోగులు పవన్‌కు తెలిపారు.

నా ఇంటిని జగనన్న ఇళ్ల పథకానికి తీసుకుని పరిహారం ఇవ్వడం లేదు :

విశాఖ జిల్లా కోరాడకు చెందిన మరో రైతు తన భూమిని జగనన్న ఇళ్ల పథకానికి తీసుకుని రూపాయి కూడా ఇవ్వకుండా లాగేసుకున్నారని వాపోయాడు. కోర్టుకు వెళ్లినా, అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని, ఎమ్మెల్యే అందరినీ వేధిస్తున్నాడని ఆ రైతు పవన్ దృష్టికి తీసుకెళ్లాడు. తన మనుమడిని చంపేసి రోడ్డు మీద పడేశారని.. చంపేశారని ఆధారాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని సన్యాసమ్మ అనే బాధితురాలు వాపోయింది. దీనికి తోడు రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారని ఆమె తన గోడును వెళ్లబోసుకుంది.