ఎందరో పోరాట యోధుల త్యాగ ఫలం.. తెలంగాణ కీర్తి అజరామరం : జనసేన అధినేత పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను ’’ అంటూ పవన్ పేర్కొన్నారు.
2001 వరకు తెలంగాణ రాదనే అనుకున్నారు :
కాగా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. కానీ ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా ఎదిగిందని కేసీఆర్ తెలిపారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రక్తసిక్తమైందని.. 2001 వరకు తెలంగాణ రాదనే ప్రజలు భావించారని ఆయన గుర్తుచేశారు. కానీ మలిదశ ఉద్యమంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు , కవులు, కళాకారులు, కార్మికులు, మహిళలు అందరూ కదం తొక్కారని కేసీఆర్ తెలిపారు. వారందరీకి, ఉద్యమంలో అమరులైన వారికి ముఖ్యమంత్రి తలవంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments