Pawan Kalyan:ఏపీకి అమరావతే రాజధాని .. జనసేన స్టాండ్ ఇదే : కుండబద్ధలు కొట్టిన పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Thursday,June 15 2023]
అమరావతి రాజధాని విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అమరావతికి సేకరించిన భూమి సరిపోదని, మరో 5 వేల ఎకరాలు సేకరించాలని చెప్పారని గుర్తుచేశారు. అమరావతి రాజధానిగా జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని, తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో ఉన్నారని.. కులం తాలుకా రాజధాని అని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. విపక్షంగా ఉన్నపుడే అమరావతిని వ్యతిరేకించి ఉండాల్సిందని.. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని పవన్ కళ్యాణ్ చురకలంటించారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ను వెనక్కు తోయడానికి మాత్రమే అనేది ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.
అప్పుడు మాదాపూర్ అలా.. ఇప్పుడిలా :
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మాదాపూర్ శివారున ఉండేదని.. కొన్ని సంవత్సరాల్లోనే ఇప్పుడు టెక్ ప్రాంతంగా మారిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అభివృద్ధి అనేది రాత్రికి రాత్రి జరగదని.. దానికి పాలకుల ముందు చూపు, సమయం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ కచ్చితంగా రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. అమరావతిలో అన్నీ కులాలున్నాయని, వారిని కలిపే ఆలోచన, పాలసీలను వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తే కచ్చితంగా స్వాగతించే వాడినని ఆయన పేర్కొన్నారు.
కొత్త జంటకు పెళ్లి రిజిస్ట్రేషన్ తో పాటు రేషన్ కార్డు:
కొత్త పెళ్లి అయిన దంపతులకు పెళ్లి కానుక, షాదీ ముబారక్ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని పవన్ మండిపడ్డారు. ఇటీవల పథకాలు అమలు చేస్తున్నా బోలెడు నిబంధనలు పెట్టారని ఎద్దేవా చేశారు. కానీ జనసేన ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెళ్లి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రంతో పాటు కొత్త రేషన్ కార్డు అందించేలా పథకం తీసుకొస్తామని పవన్ హామీ ఇచ్చారు. నవ దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తే, తప్పనిసరిగా వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని, బీపీఎల్ పరిధిలోని వారికే కాకుండా కొత్తగా పెళ్లయిన వారందరికీ దీనిని వర్తింపజేస్తామి పవన్ కల్యాణ్ తెలిపారు.