Pawan Kalyan:టీడీపీ - జనసేన పొత్తు : సమన్వయ కమిటీ నియమించిన పవన్.. నాదెండ్ల మనోహర్‌కు పగ్గాలు
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో జనసేన నడుస్తుందని ప్రకటించి కలకలం రేపారు పవన్ కల్యాణ్. ఎన్నికలకు ఎంతో సమయం వుండగా ఆయన నోటి నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని సొంత పార్టీతో పాటు టీడీపీ, వైసీపీలు సైతం ఊహించి వుండవు. పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేనతో టీడీపీ పొత్తు కన్ఫర్మ్ కావడంతో ఈ రెండు పార్టీల్లో జోష్ నెలకొనగా.. వైసీపీలోని కొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే :
ఇదిలావుండగా శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కలిసి పనిచేసే సమయంలో ఎవరూ ఇగోలకు పోవద్దని సూచించారు. వైసీపీకి ఆరు నెలలే సమయం వుందని.. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేద్దామని, పదవుల గురించి తర్వాత ఆలోచిద్దామని పవన్ హితవు పలికారు. ఇక్కడ ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదని ఆయన పేర్కొన్నారు.
నాదెండ్ల అనుభవం ఉపయోగపడుతుంది :
మరోవైపు.. టీడీపీతో సమన్వయం కోసం జనసేన అధినేత ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను సమన్వయ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వున్న ఆయన ఈ విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయేలో భాగమైనప్పటికీ రాష్ట్రంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జగన్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఆశీస్సులతో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీట్లు, పవర్ షేరింగ్ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని ఆయన తెలిపారు. వైసీపీ లీడర్లు రెచ్చగొట్టే ప్రమాదం వుందని, ఈ విషయంలో సంయమనంతో వుండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
సనాతన ధర్మం మారుతోంది :
రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. కాలమాన పరిస్ధితులు, అవసరాల మేరకు సనాతన ధర్మం మారుతుందని.. ద్వేషం, దోపిడీ కొంతకాలం మాత్రమే వుంటాయని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని పవన్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout