జనం కోరుకున్నదొకటి.. జగన్ సర్కార్ చేసింది మరొకటి : జిల్లాల ఏర్పాటుపై పవన్ ఆగ్రహం
- IndiaGlitz, [Monday,April 04 2022]
పలుమార్లు వాయిదా పడుతూ.. అక్కడక్కడా నిరసనలు చికాకు పెట్టినా ఎట్టకేలకు ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆ క్షణం నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం జిల్లాల విభజనపై పెదవి విరుస్తున్నాయి.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా రాష్ట్రంలో జిల్లాల విభజన చేశారని ఆయన ఆరోపించారు. పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారంటూ పవన్ దుయ్యబట్టారు. విభజన లోపభూయిష్టంగా సాగిందని.. అసలు జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం అధ్యయనం కూడా చేయలేదని జనసేనాని ఆరోపించారు. జిల్లాల విభజనతో ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతాయని.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా అవి తప్పడం లేదంటూ దుయ్యబట్టారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్నారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం జిల్లా కేంద్రాలుగా ఉండాలని డిమాండ్లు వచ్చాయని పవన్ గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రజల నిరసనకు జనసేన అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.