Pawan Kalyan:ఏపీ రావాలంటే వీసా.. పాస్‌పోర్ట్‌లు కావాలేమో : పోలీసులపై పవన్ ఆగ్రహం, రోడ్డుపై పడుకుని నిరసన
- IndiaGlitz, [Sunday,September 10 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీలోకి అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు పవన్. అయితే ఆయన వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కృష్ణాజిల్లా పోలీసులు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న అధికారులు పవన్ విమానాన్ని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలోనే నిలిపివేశారు. దీంతో చేసేది లేక పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పవన్‌ను అడ్డుకున్నారు.
గరికపాడు వద్ద పవన్‌ను అడ్డుకున్న పోలీసులు :
గరికపాడు వద్ద పవన్ కళ్యాణ్‌కు వేలాది మంది జనసైనికులు, అభిమానులు స్వాగతం పలకగా.. అక్కడే పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వ్యూహాత్మకంగా పవన్ కాన్వాయ్‌ని ముందుకు నడిపించి అనుమంచిపల్లి సమీపంలోకి వచ్చాక వాహన శ్రేణిని నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ కల్యాణ్ కారు నుంచి కిందకి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు.
నేరస్థులకు అధికారమిస్తే ఇలాగే వుంటుంది :
ఇదే సమయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్థులకు అధికారం ఇస్తే ఇలాగే వుంటుందని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని తాము ఊహించలేదన్నారు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకున్నామని.. దీని కోసమే తాను విజయవాడ బయల్దేరానని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నేరస్తుడని.. ఆయన విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేని పేర్కొన్నారు. బెయిల్‌పై బయటకు వెళ్లే ఆయనకు ఎంతసేపూ అరెస్టులు చేయించాలనే ఆలోచనలే వుంటాయని.. తనలాగే అందరినీ నేరస్థులుగా మార్చాలని కోరుకుంటాడని పవన్ దుయ్యబట్టారు. ఏపీ రావాలంటే వీసా, పాస్‌పోర్టులు కావాలేమో అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విమానంలో వద్దన్నారు, కారులో అనుమతి లేదన్నారు.. పోనీ నడిచి వెళ్తామన్నా వీలు కాదంటున్నారని ఫైర్ అయ్యారు.