Pawan Kalyan:ముగిసిన పవన్ ఢిల్లీ పర్యటన .. అమిత్ షాను కలవకుండాను, పొత్తులపై సస్పెన్స్ కంటిన్యూ

  • IndiaGlitz, [Wednesday,April 05 2023]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల క్రితం రాజధానికి చేరుకున్న ఆయన.. బీజేపీ నేతలు, పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే పవన్ ఢిల్లీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈసారి అమిత్ షాతో ఖచ్చితంగా మీటింగ్ వుంటుందని వార్తలు వచ్చినప్పటికీ.. అదేమి లేకుండా పవన్ హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

వైసీపీ విముక్త ఏపీయే జనసేన లక్ష్యమన్న పవన్ :

ఇదిలావుండగా నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే జనసేన అభిమతమని పవన్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఆయన పేర్కొన్నారు. రెండు రోజల పాటు జరిగిన చర్చల వల్ల భవిష్యత్‌లో సత్ఫలితాలు వస్తాయని.. వైసీపీని ఓడించడం గురించే తాము చర్చించినట్లుగా పవన్ తెలిపారు. అయితే ఎప్పటిలాగే పవన్ పొత్తులపై క్లారిటీ ఇవ్వకుండానే మీడియాను, ప్రజలను సస్పెన్స్‌లో పెట్టారు.

ఇప్పటికీ డైలామాలోనే పవన్:

వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. టీడీపీ, బీజేపీలతో కలిసి వెళ్లాలన్నది పవన్ అభిమతం. కానీ కమలనాథుల నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబును కాషాయ నేతలు నమ్మడం లేదు. ఇటు జనసేన విషయంలో ఏపీ బీజేపీ నేతలు అంత సఖ్యతగా వుండటం లేదు. ఈ రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు వున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఉమ్మడిగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. దీనికి తోడు తమతో పొత్తులో వుంటూ చంద్రబాబుతో పవన్ చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఏపీ బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అటు క్యాడర్‌కు సైతం పవన్ సరైన సంకేతాలు పంపలేకపోతున్నారు. పొత్తులకు సిద్ధమని ఒకసారి, ఎవరి పల్లకీలు మోయలేమని మరోసారి చెబుతున్నారు. దీంతో పవన్ తుది నిర్ణయం ఏంటన్నది కేడర్‌కు కూడా అంతుచిక్కకుండా వుంది.

జనసేన తమతో కలిసి రావడం లేదంటోన్న బీజేపీ :

ఇదిలావుండగా.. జనసేన తమతో కలిసి రావడంత లేదని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనతో పొత్తు వున్నా.. లేనట్లుగానే వుందని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రాలేదని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్ధికి జనసేన మద్ధతు వుందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని కోరినా జనసేన వైపు నుంచి స్పందన లేదని మాధవ్ వ్యాఖ్యానించారు.పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. తాము మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఢిల్లీ వెళ్లిన పవన్ ఈసారి మాత్రం పొత్తులపై క్లారిటీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సస్పెన్స్‌ని కంటిన్యూ చేశారు.