GSLV F12 NVS 01 : జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం.. ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు
- IndiaGlitz, [Monday,May 29 2023]
జీఎస్ఎల్‌వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటి ఎన్వీఎస్ –1 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ -12 వాహన నౌక ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించి, కక్షలోకి ప్రవేశపెట్టడం భారతీయులుగా గర్వించదగిన విషయమన్నారు పవన్. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన ఇస్రో ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి అంటూ పవన్ కల్యాణ్ ఉద్వేగానికి గురయ్యారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో అధునాతన సాంకేతికతతో రూపొందించిన నావిక్ రెండో తరం ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కీర్తి పతాకలో మరో కలికితురాయిగా ఆయన అభివర్ణించారు.
భవిష్యత్తు సమాచార విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయి :
ఎల్ 1 సిగ్నల్స్ ను పంపే రెండో తరం నావిక్ ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థలో కచ్చితమైన సమాచారాన్ని పంపేందుకు ఉపయోగపడతాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇవి భవిష్యత్తు సమాచార విప్లవంలో కొత్త పుంతలు తొక్కిస్తాయనడంలో సందేహం లేదని ఆయన ఆకాంక్షించారు. ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇస్రో పురోభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న వారందరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు.
శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ అభినందనలు :
ఈ శాటిలైట్ దేశీయ నావిగేషన్ సేవలు అందించనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు ఇస్రో సైంటిస్ట్‌లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ డా.సోమ్‌నాథ్ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందన్నారు. ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్‌వీఎస్ 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని.. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైనదని, ఆ స్టేజీ కూడా సవ్యంగా సాగిందని డాక్టర్ సోమ్‌నాథ్ తెలిపారు.
ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి నావిగేషన్ శాటిలైట్ ప్రయోగం:
ఇకపోతే.. జీఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు కాగా.. బరువు 420 టన్నులు. దీని ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్ 01 రాకెట్ జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారతదేశ ప్రధాన భూభాగం చుట్టూ దాదాపు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పోజిషనింగ్ సేవలను అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశీయ నావిగేషన్ సేవల కోసం గతంలో ఇస్రో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహానికి అంతరిక్షంలోకి పంపుతున్నామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.
నావిక్ రెండో తరం ఉపగ్రహాలతో సరికొత్త సమాచార విప్లవం - JanaSena Chief Shri @PawanKalyan #NAVIK
— JanaSena Party (@JanaSenaParty) May 29, 2023
#GSLVF12
#NVS01 pic.twitter.com/2OkHJcvjE8