Gudipudi Srihari : పాత్రికేయ దిగ్గజం గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. ఆయన రివ్యూలు గీటురాయిలా వుండేవి : పవన్ దిగ్భ్రాంతి
- IndiaGlitz, [Tuesday,July 05 2022]
సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ మంగళవారం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘పాత్రికేయ రంగంలో... ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన గుడిపూడి శ్రీహరి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి గారు రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.
55 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం.. భార్య మరణంతో ఒంటరి:
కాగా.. సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గతవారం ఇంటిలో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో శ్రీహరిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీని నుంచి కోలుకున్నప్పటికీ .. ఇతర అనారోగ్య సమస్యలతో శ్రీహరి ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. విదేశాల్లో వున్న కుమారుడు శ్రీరామ్ భారత్ కు రాగానే శ్రీహరి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గుడిపూడి సతీమణి లక్ష్మీ గతేడాది నవంబర్ లో మరణించారు. ఈ దంపతులకు ఓ అబ్బాయి, ఒక అమ్మాయి వున్నారు. 55 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈనాడు సహా ప్రముఖ తెలుగు దినపత్రికల్లో శ్రీహరి పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యఘట్టాలు, విశేషాలకు సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని గుడిపూడి రచించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.