ఉపాధి కోసం వచ్చి సజీవదహనం.. సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

  • IndiaGlitz, [Wednesday,March 23 2022]

సికింద్రాబాద్ బోయగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది వలస కార్మికులు సజీవ దహనం బాధాకరమని ఆయన అన్నారు. వారి మృతి తీవ్రంగా కలచివేసిందని .. ఉపాధి కోసం బిహార్‌ నుంచి వలస వచ్చిన కూలీలు మృతిచెందడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం బిహార్‌ నుంచి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం.. పర్యవేక్షణాలోపమే ఈ తరహా ప్రమాదాలకు కారణమని బండి సంజయ్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కాగా.. ఐడీహెచ్‌ కాలనీలోని స్క్రాప్‌ దుకాణంలో 15 మంది కార్మికులు మంగళవారం రాత్రి నిద్రపోయారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడగా.. మిగిలిన 13 మంది అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. వీరిలో 11 మంది సజీవ దహనమవ్వగా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. వీరంతా బిహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. బిహార్‌లోని చాప్రా జిల్లా జక్కువు గ్రామానికి చెందిన వీరంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మృతులను సికిందర్‌ (40), బిట్టు (23), సత్యేందర్‌ (35), గోలు (28), దామోదర్‌ (27), రాజేశ్‌ (25), దినేశ్‌ (35), రాజు (25) చింటు (27), దీపక్‌ (26), పంకజ్‌ (26)గా గుర్తించారు.