ఒక్కసారి అవకాశమివ్వండి.. కోట్ల మంది కన్నీరు తుడుస్తా : కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్
- IndiaGlitz, [Monday,May 09 2022]
ఒక్కసారి అవకాశమిస్తే.. కోట్ల మంది కన్నీరు తుడుస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆదివారం నంద్యాల జిల్లాలో జరిగిన జనసేన కౌలు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... రాయలసీమను రతనాలసీమ అనేవారని కానీ రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చూస్తుంటే బాధేస్తుందన్నారు. 18 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చే సిద్దేశ్వరం - అలుగు ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారని పవన్ మండిపడ్డారు. 70 ఏళ్లుగా ఇక్కడి రైతాంగం ఈ ప్రాజెక్ట్‌పై కలలు కంటున్నారని.. నాయకుల తీరుతో విసిగి, వేసారి 2016లో రైతులే ప్రాజెక్ట్ ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. అయితే దానిని పూర్తి చేయడంలో రాయలసీమవాసులకు అండగా నిలబడటంలో మాత్రం ఏ ప్రభుత్వాలు శ్రద్ధ చూపించలేకపోయాయని పవన్ దుయ్యబట్టారు. ఐదు సంవత్సరాలు తమకు అవకాశం ఇస్తే... రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత తనదేనన్నారు.
సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. రాయలసీమ నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు వచ్చారని.. ముఖ్యమంత్రిలాంటి అత్యున్నత పదవులు పొందారని, కానీ రాయలసీమ స్వరూపం మాత్రం ఏమాత్రం మారలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు బలపడ్డారు తప్పితే ప్రజల జీవితాల్లో ఏ మాత్రం మార్పు లేదని... వారికి అవసరమైతే అద్భుతమైన రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని.. ప్రజల అవసరాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కారణం చేతనే రాయలసీమ వెనకబడిపోయిందని.. యువతరం ఆలోచించాలి.. మా ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయింది అని ప్రశ్నించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి అండగా నిలిస్తే... రైతులకు, యువతకు తాము భరోసాతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కౌలు రైతులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే తనకున్న కొద్దిపాటి నిధులు, వనరులతో ఈ మహా ప్రయాణానికి చిన్న అడుగు వేశానని పవన్ చెప్పారు. ఎన్.జి.రంగా, అల్లూరి సుబ్బారెడ్డి, రామిరెడ్డి, కుప్పుస్వామి లాంటి రైతాంగ ఉద్యమాలు నడిపిన నాయకులు ఉన్న గొప్ప నేలలో జరుగుతున్న ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయన్నారు. నంద్యాల ఆర్.ఎస్.ఆర్.ఏ.కి చెందిన 100 ఎకరాల అద్భుతమైన నేల కబ్జా అవుతుంటే దానిని సమర్ధంగా తిప్పికొట్టి న్యాయపోరాటం చేసిన కర్నూలు జిల్లా రైతుల చైతన్యం గొప్పదని పవన్ ప్రశంసించారు.
ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్న తానే కార్యకర్తల కోసం రూ. ఐదు లక్షల ప్రమాద బీమా చేయించి ఇస్తుంటే, ఈ ప్రభుత్వానికి కౌలు రైతులకు రూ.ఏడు లక్షలు ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని ఆయన ప్రశంసించారు. అధికారం కోసం అర్రులు చాచనని.. సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా రైతులందరికీ న్యాయం జరగాలి అన్నదే తన అభిలాష అన్నారు. అమ్మ పెట్టా పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్లు రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మాకు తోచినంత సాయం చేయాలని మేం భావిస్తే, బాధితులను సైతం వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని ఆటంకాలు కలిగించినా తాము కౌలు రైతులను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.