Pawan Kalyan:జగన్ను రోడ్డు మీదకు లాగాల్సిందే.. ఆన్లైన్ యుద్ధం చేద్దాం రండి : ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు
- IndiaGlitz, [Monday,June 19 2023]
తెలంగాణ ఎన్నికలతో పాటే ఆంధ్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు రావొచ్చని.. నిన్న మొన్నటి వరకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు ముందు కాంట్రాక్టర్లకు రూ. 1500 కోట్లు చెల్లించిందన్నారు. మిథున్ రెడ్డికి రూ. 600 కోట్లు, రాఘవ కనస్ట్రక్షన్ శ్రీనివాస రెడ్డికి రూ. 300 కోట్లు, ఎంఆర్కేఆర్ కన్ స్ట్రక్షన్ రఘునాథ్ రెడ్డికి రూ. 250 కోట్లు, వీపీఆర్ ప్రభాకర్ రెడ్డికి రూ.50 కోట్లు చెల్లించిందని పవన్ ఆరోపించారు. వారంతా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేవారు కావడంతోనే వారికి చెల్లింపులు జరిగినట్లు ఓ ఇంజినీరు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భీమవరంలో ఓటర్ల లిస్టులో ఉన్న ఓట్లు కంటే 10 వేలు ఎక్కువ పోలైయ్యాయని.. తాను ఎక్కడ నిలబడినా నన్ను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దోపిడీ దారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే తనతో పాటు తన ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై
ఉందని ఆయన పిలుపునిచ్చారు.
వైసీపీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోయాల్సిందే:
వైసీపీ నాయకులు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రకృతి వనరుల దోపిడీ, కబ్జాలు ఇలా అన్నీ అంశాలపై ఆన్లైన్ వేదికగా కలిసికట్టుగా యుద్ధం చేద్దామని పవన్ కల్యాణ్ కోరారు. గతంలో రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ప్రపంచానికి ఎలా చూపించగలిగామో అదే మాదిరిగా ఈ ఆన్లైన్ యుద్ధంలో అంతా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ రౌడీలు, గూండాలు ఏం చేసినా, ఎలాంటి అవినీతి కార్యక్రమమైనా వెంటనే ఫొటోలు తీసి ఆన్లైన్లొ హ్యాష్ ట్యాగ్ జోడించి ప్రపంచానికి చూపిద్దామన్నారు. # APCMBENAMI, #APCMDGANG, #YSJaganaAndGang, #YSJaganBenmi హ్యాష్ ట్యాగులు జోడించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి, జనసేన కార్యాలయానికి పెట్టాలని పవన్ కోరారు. కలుగులో ఉన్న క్రిమినల్ ఎలుకలను బయటకు తీద్దామని, ప్రపంచం మొత్తం తెలిసేలా చేద్దామన్నారు. క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోసి.. జగన్ను రోడ్డు మీదకు తీసుకొద్దామని జనసేనాని పిలుపునిచ్చారు.