Pawan kalyan : కౌలు రైతు భరోసా యాత్రకు రూ.5 లక్షల విరాళం.. తదేకం ఫౌండేషన్‌కు పవన్ ప్రశంసలు
- IndiaGlitz, [Tuesday,July 19 2022]
తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహావతార్ బాబాజీ స్ఫూర్తితో గురూజీ నౌషీర్ ప్రారంభించిన ‘తదేకం ఫౌండేషన్’ చేస్తున్న సామాజిక సేవా, సంక్షేమ కార్యక్రమాలు అందరిలో సేవా దృక్పథాన్ని కలిగిస్తోందన్నారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో కలసి తదేకం ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మహిళలకు, వికలాంగులకు ఉపయుక్తంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
కౌలు రైతు భరోసా యాత్రకు రూ.5 లక్షల సాయం:
వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇవ్వడంతోపాటు మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మెషిన్లు అందజేస్తున్నారని కొనియాడారు. తదేకం ఫౌండేషన్, జనసేన సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలను ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సుధ జనసేన అధినేతకు వివరించి గురూజీ పంపిన సందేశాన్ని అందచేశారు. అనంతరం జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తమ వంతుగా ఫౌండేషన్ తరఫున రూ.5 లక్షల విరాళం అందచేశారు. ఈ సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.
గతంలోనూ పవన్‌ని కలిసిన తదేకం ఫౌండేషన్ సభ్యులు:
ఏపీలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సాయి సుధ, నీలేశ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. తదేకం ఫౌండేషన్ కార్యాచరణ వివరాలు తెలుసుకున్న ఆయన వారిని అభినందించారు. మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషీర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవలను మరింత ముందుకు తీసుకెళుతున్నారంటూ ప్రశంసించారు. తదేకం ఫౌండేషన్ కార్యక్రమాలకు అనేకమంది ప్రముఖులు, యువత, జనసైనికులు కూడా మద్దతుగా నిలుస్తుండడం సంతోషదాయకమని పవన్ కల్యాణ్ జనసైనికులు ఇకపైనా ఇదే స్ఫూర్తి కనబర్చాలని పిలుపునిచ్చారు.