Pawan Kalyan:మన డేటా వాళ్లకెందుకు ఎందుకు ..ఆడబిడ్డలు ఏమయ్యారు, వాలంటీర్లపై వ్యాఖ్యలు : పవన్ కల్యాణ్‌ది అదే స్టాండ్
Send us your feedback to audioarticles@vaarta.com
వాలంటీర్ వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం దెందులూరు నియోజకవర్గ జనసేన నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను జగన్ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్లి సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం ఎక్కడుందని పవన్ నిలదీశారు. ఆరేళ్ల బాలికపై వాలంటీర్ అఘాయిత్యం చేస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదు.. వైసీపీకి ఎదురుతిరిగే వాళ్లను భయపెట్టడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందని పవన్ ఆరోపించారు. రూ.5 వేలకు యువత శ్రమను దోపిడీ చేస్తున్నారని.. వైసీపీ రాకముందే రాష్ట్రంలో ఎలాంటి వాలంటీర్ వ్యవస్థలు లేవని, వాళ్లు లేకపోతే రాష్ట్రం ఏం ఆగిపోదని ఆయన స్పష్టం చేశారు.
జనవాణిలో వాలంటీర్ల అకృత్యాలు :
వాలంటీర్ల అకృత్యాలపై జనవాణి కార్యక్రమంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం 2019-21 మధ్యకాలంలో రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన 22,278 మంది అదృశ్యమయ్యారని పవన్ కల్యాణ్ తెలిపారు. కడప జిల్లాలో దళిత వర్గానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. వాలంటీర్లు అనే నిఘా వ్యవస్థ ద్వారా జగన్ మన ఇంట్లో జరిగేది తెలుసుకుంటున్నాడని.. ఈరోజు పవన్ అనే వ్యక్తి మాట్లాడకుంటే ఆడపిల్లల మిస్సింగ్ కేసుల గురించి తెలిసేదా అని పవన్ ప్రశ్నించారు. ఆనాడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై ఉరితీయాలని జగన్ ఊగిపోయి మాట్లాడొచ్చు.. నేను ప్రజా సమస్యల మీద ఊగిపోతూ మాట్లాడకూడదా అంటూ ఆయన నిలదీశారు. ఆయనది పదవీ వ్యామోహం, నాది పేదోడి ఆక్రందనల ఆవేశమని పవన్ తెలిపారు.
జనాన్ని భయపెట్టే స్థాయికి వాలంటీర్లు :
వాలంటీర్ల వ్యవస్థ ప్రజలను నియంత్రించి , భయపెట్టే స్థాయికి వెళ్లిపోయిందన్నారు. 5 కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి 5 లక్షల మంది వాలంటీర్లను జగన్ ఉపయోగిస్తున్నాడని పవన్ దుయ్యబట్టారు. విషయం పక్కదారి పట్టించడానికి తనను వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా తిడుతున్నారని చెప్పారు. తన చిన్నప్పుడు రమిజాబీ అనే మహిళపై పోలీస్ స్టేషన్లో పోలీసులు సామూహిక అత్యాచారం చేశారని.. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రగిలిపోయిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. చిన్న కేసే కదా అని వైసీపీ మంత్రుల్లా వదిలేయలేదని.. అదీ పోరాటం అంటేనని ఆయన తెలిపారు.
ఓ సంస్కారహీనుడు సీఎం అయ్యాడు:
సమస్యలను, చీకట్లో వైసీపీ చేస్తున్న పనులను ఎత్తిచూపితే ఏపీని పట్టి పీడిస్తోన్న జగన్ అనే జలగకు కోపం వచ్చిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంత వరకు ఫ్యాక్షన్, కిరాయి మూకలనే చూవాడని.. కానీ ఓ విప్లవకారుడితో గొడవ పెట్టుకుంటే ఎలా వుంటుందో తాను చూపిస్తానని జనసేనాని హెచ్చరించారు. ఓ సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా వుంటుందో ఈతరం చూడటానికే జగన్ గెలిచాడని.. చిన్నపిల్లలు వున్న సభలో వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 200 రోజులు పనిచేస్తే రూ.400 కోట్లు సంపాదించగలనని.. కానీ చావుకు తెగించే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
పాలనలో ఎమ్మెల్యేలకు చోటు లేదు : నాదెండ్ల
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి కూడా పాలనలో చోటు లేదని, కనీసం గౌరవం కూడా లేదని దుయ్యబట్టారు. వాలంటీర్లతో వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేశారని.. మాట్లాడితే వాలంటీర్లే సంక్షేమ వారథులని చెబుతున్నారని, వీరి వల్ల ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని మనోహర్ ప్రశ్నించారు. జగన్ బటన్లు నొక్కడం వల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటని ఆయన నిలదీశారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమిష్టిగా ముందుకు వెళ్లి ప్రభావం చూపాలని ఆయన నేతలకు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments