Janasena Chief Pawan:ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే .. దాడులు, అక్రమ కేసులు.. మా నమ్మకం జనసేనే : పవన్‌తో ఉప్పాడ మత్స్యకారులు
- IndiaGlitz, [Friday,June 16 2023]
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన జనవాణి - జనసేన భరోసాకు సమస్యల వెల్లువెత్తాయి. రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు, భిన్న వర్గాల ప్రజల ఆవేదనలను తెలుసుకున్నారు జనసేనాని. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు జడివానలా వెల్లువెత్తాయి. పిఠాపురం నియోజకవర్గ పరిసరాల నుంచి వివిధ సమస్యలపై 34 మంది అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో కష్టాన్ని పవన్ కల్యాణ్‌కు చెప్పుకున్నారు.
‘ఉప్పెన’ ఇల్లు ఇప్పుడు లేదు :
ఉప్పాడ తీర ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలు సముద్ర గర్భంలో కలసి పోతున్నాయిని.. తుఫానులు, భారీ వర్షాల సమయంలో సముద్రపు నీరు ఇళ్లలోకి వచ్చేస్తోందని బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉప్పెన సినిమాలో చిత్రీకరించిన ఇల్లు ఇప్పుడు నామ రూపాలు లేకుండా పోయిందని వెల్లడించారు. గతంలో పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జియో ట్యూబ్ ద్వారా కోతకు అడ్డుకట్ట వేశారని, అయితే తుపానుల తాకిడికి అది కాస్తా దెబ్బతిన్నదని పవన్ కళ్యాణ్‌కు బాధితులు తెలిపారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల జీవితాలను ముందుకు తీసుకువెళ్తానన్న ముఖ్యమంత్రి.. సముద్ర తీరం నుంచి మమ్మల్ని ఏడెనిమిది అడుగులు వెనక్కి పొయేలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
బీచ్ రోడ్ పరిస్ధితి దారుణం:
తుఫాను షెల్టర్లు నిర్మించాల్సిన అవసరం వుందని.. గతంలో వఉన్నవాటినీ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు, కమ్యునిటీ హాల్స్ పేరిట కబ్జా చేసేసిందని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యేకి చెప్పినా ప్రయోజనం శూన్యమని.. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్ రోడ్డు దారుణంగా దెబ్బతిందని వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారులంతా జనసేనని నమ్ముతున్నామని.. మీ ప్రభుత్వంలో మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి అంటూ ఉప్పాడ తీరంలో నివసించే మత్స్యకార గ్రామాల ప్రజలు పవన్ ముందు తమ సమస్యల చిట్టా విప్పారు.
ఎమ్మెల్యే మనుషులం అంటున్నారు :
రాను రాను మట్టి మాఫియా పేట్రేగిపోతోందని.. 60-70 టన్నుల లోడుతో వెళ్తున్న లారీల కారణంగా తమ గ్రామాల్లో రహదారులు దారుణంగా దెబ్బతింటున్నాయని పవన్‌కి తెలిపారు. రహదారి పక్కన ఉన్న చిన్న చిన్న పెంకుటిళ్లు కూడా పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను అడ్డుకుంటే కొట్టించి కేసులు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. క్యుబిక్ మీటర్ లెక్కన పది వేల క్యుబిక్ మీటర్లు తవ్వుకునేందుకు వర్క్ ఆర్డర్ తెచ్చుకుని 50 ఎకరాలు 40 అడుగుల లోతు తవ్వేశారని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిలదీస్తే.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా వ్యక్తులు తవ్వుతున్నారని చెబుతున్నారని, జగనన్న కాలనీలకు తోలుతున్నామని చెబుతున్నారని తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తే అధికారుల విధులు అడ్డుకున్నారంటూ వీఆర్వోతో కేసు పెట్టించారని తాటిపర్తి గ్రామానికి చెందిన అడబాల వీర్రాజు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.