డిప్యూటీ సీఎం నిమ్మకాయలపై పోటీకి జనసేన అభ్యర్థి రెడీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పపై(టీడీపీ) ఆయన సొంత సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ ) జనసేన తరఫున పోటీ చేయనున్నారా..? అన్నా తమ్ముళ్ల మధ్య టఫ్ ఫైట్ నడవనుందా..? డిప్యూటీ సీఎంనే ఓడించడానికి జనసేనాని కంకణం కట్టుకుంటున్నారా..? ఆయన్ను టార్గెట్‌గా చేసుకున్న పవన్.. ఆయన సోదరుడ్ని బరిలోకి దింపుతారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
గత నెలలో టీడీపీకి టాటా చెప్పి.. సొంత కుటుంబీకుడు అయిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను కాదనుకొని ఆయన సోదరుడు బాపూజీ.. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిత్వం కోరుతూ చినరాజప్ప సోదరుడు లక్ష్మణమూర్తి స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. పార్టీ నిర్దేశించిన నమూనాలను పూర్తి చేసి విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. తన సోదరుడు పోటీ చేసి గెలిచిన పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచే అభ్యర్థిత్వం కోరుతూ లక్ష్మణమూర్తి బయోడేటా సమర్పించడం గమనార్హం.
అయితే ఆ నియోజకవర్గం నుంచి దాదాపు ఈయనకే టికెట్ ఖరారైనట్లేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే తన సోదరుడు జనసేనలో చేరడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజప్ప.. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అభ్యర్థిత్వం కోరడంతో ఆయన ఒకింత షాక్‌కు లోనయ్యారట. ఇదేగానీ జరిగితే అన్నదమ్ముల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ టఫ్ ఫైట్‌లో సోదరుడు గెలుస్తారా..? డిప్యూటీ సీఎం గెలుస్తారా..? అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
పితాని బాలకృష్ణ కూడా...
ఇదిలా ఉంటే.. జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు మొట్టమొదటి బిఫాం ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ముమ్మిడివరం జనసేన అభ్యర్ధి పితాని బాలకృష్ణ కూడా శుక్రవారం రోజునే స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. వీరితోపాటు బయోడేటాలు సమర్పించిన వారిలో వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు, మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం. కాగా.. శుక్రవారం ఒక్క రోజే సుమారు 10 మంది వైద్యులు జనసేన అభ్యర్ధిత్వం కోరుతూ బయోడేటాలు సమర్పించడం జరిగింది. వీరంతా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నవారే. స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు సమర్పించాల్సిన గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. కాగా.. ఇవాళ ఒక్క రోజే 220 బయోడేటాలు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చినట్లు సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout